
కొరిటెపాడు(గుంటూరు): తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన మార్కెటింగ్‌శాఖ సిబ్బంది, కార్యదర్శులు మూడు నెలల శిక్షణలో భాగంగా గురువారం గుంటూరులోని మిర్చి యార్డును సందర్శించారు. యార్డులో జరుగుతున్న క్రయ, విక్రయాలు.. మిర్చి యార్డుకు ఏఏ జిల్లాలు, రాష్ట్రాల నుంచి మిర్చి రైతులు తరలి వస్తారు.. ఏఏ రకాల మిర్చి వస్తుంది.. ఏఏ రకాలకు ఎంతెంత ధర లభిస్తుంది.. మిర్చి ఎగుమతి, దిగుమతి వ్యాపారులు ఏ విధంగా వ్యవహరిస్తారు.. రైతులకు యార్డులో కల్పిస్తున్న వసతులు, మిర్చిని కొనుగోలు చేసిన తర్వాత రైతులకు ఎన్ని రోజుల్లో డబ్బు చెల్లిస్తారు.. తదితర అంశాలపై యార్డు చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డిలు వారికి వివరించారు. అనంతరం యార్డు ఆవరణలోని సమావేశ మందిరంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజానారాయణ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం కేటాయించిన విధులను కార్యదర్శులు బాధ్యతగా నిర్వర్తిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని గుర్తుచేశారు. కార్యదర్శులు తీసుకునే నిర్ణయాలపై వేల కుటుంబాలు ఆధారపడి ఉంటాయని, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో మార్కెటింగ్‌శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీనివాసరావు, సహాయ సంచాలకులు బి.రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న
దేహదారుఢ్య పరీక్షలు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో మహిళా ఎస్‌ఐ అభ్యర్థులకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు గురువారం కొనసాగాయి. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, ఒంగోలు పీటీసీ ప్రిన్సిపాల్ ఎ.ఆర్.దామోదర్ పోటీలను పరిశీలించారు. అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలు తనిఖీ చేశారు. అనంతరం అభ్యర్థుల చాతీ, ఎత్తు కొలతలను మహిళా పోలీస్ సిబ్బంది తీసుకున్నారు. 1,600 మీటర్లు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పోటీలు నిర్వహించారు. మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఏఎస్పీలు కె.సుప్రజ (గుంటూరు), హైమావతి (ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు), గుంటూరు రేంజ్‌లోని కొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, మహిళా పోలీస్ అధికార/ సిబ్బంది, ఐజీ కార్యాలయపు సీఐ సుధాకర్, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు.
9న జాతీయ మెగా లోక్‌అదాలత్
నగరంపాలెం: గుంటూరు జిల్లాలోని ప్రతి కోర్టులో ఈనెల 9న జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్‌హఫీజ్ తెలిపారు. జిల్లాలోని సబ్ డివిజన్ల పోలీస్ అధికారులు, పోలీస్‌స్టేషన్ల సీఐలతో గురువారం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి జూమ్ వీడియో ద్వారా ఎస్పీ మాట్లాడారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో వీలైనంత త్వరగా ఎక్కువ కేసులు పరిష్కరించాలని అన్నారు. జిల్లాలో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల ప్రకారం ఫామ్ నంబర్ ఒకటిని 48 గంటల్లో పూర్తి చేయాలని చెప్పారు. ఫామ్ నంబర్లు 5, 7 నిర్దేశించిన సమయంలో పూర్తి చేసి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అన్నారు. జిల్లాలో ప్రతి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన రోడ్డు ప్రమాదాల కేసుల్లో బాధితులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. స్పెషల్ గ్రేవ్, ముఖ్యమైన కేసుల్లో విచారణ అధికారులు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సంయుక్తంగా కోర్టుకు హాజరై, కేసులు వీగి పోకుండా దోషులకు కోర్టులో శిక్ష పడేలా వ్యవహరించాలని అన్నారు. ట్రాఫిక్ డీఎస్పీ బాలసుందరరావు, ఎస్‌బీ ఇన్‌చార్జి సీఐ బాలసుబ్రమణ్యం, డీసీఆర్‌బీ సీఐ అనూరాధ, ఎస్‌ఐ వెంకటకృష్ణ పాల్గొన్నారు.

