
మంగళగిరి: లక్ష్మీనృసింహస్వామి పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పవిత్రోత్సవాలలో భాగంగా మూడో రోజు మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు మూలవరులకు స్థపన, అగ్నిహోమం, స్వామి వార్లకు పవిత్ర సమర్పణ, హోమాలు, అష్టారీతి, పారమాత్మిక హోమాలు, పరివార దేవతలకు పవిత్ర సమర్పణ, ప్రసాదగోష్టి జరిగాయి. సాయంత్రం నిత్యహోమం, పంచసూక్త హోమం, మహాశాంతి హోమాలు నిర్వహించారు భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాలను ఆలయ ఈఓ ఎ.రామకోటిరెడ్డి పర్యవేక్షించారు.
28 నుంచి నరసరావుపేట ఎల్‌సీ గేటు మూత
లక్ష్మీపురం(గుంటూరు): గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని నరసరావుపేటలో డబ్లింగ్ పనుల వల్ల ఈనెల 28 నుంచి అక్టోబర్ 1 వరకు ఎల్‌సీ గేటును మూసివేయనున్నట్లు రైల్వే శాఖ సీనియర్ డీసీఎం దినేష్‌కుమార్ మంగళవారం తెలిపారు. సాతులూరు–నరసరావుపేట–మనుమాక మధ్య డబ్లింగ్ పనుల జరుగుతున్న నేపథ్యంలో గేటును మూసివేస్తున్నట్టు వివరించారు. వాహనదారులు గమనించాలని కోరారు.
జాబ్‌మేళా వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ
వేమూరు: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు వేమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 29న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. దీనికి సంబంధించి వాల్‌పోస్టర్లను మంగళవారం ఆయన గుంటూరులోని తన స్వగృహంలో ఆవిష్కరించారు. జాబ్ మేళాకు 20 కంపెనీలు తరలివస్తాయని, 950 మందికి ఉద్యోగావకాశాలు కల్పించే ఆస్కారం ఉందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఇ.తమ్మాజీరావు చెప్పారు. జీతం వారి విద్యార్హతను బట్టి రూ.10 వేల నుంచి రూ. 30 వేల వరకు ఉంటుందని వివరించారు. నిరుద్యోగులు ఈ జాబ్ మేళాను ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రవికుమార్, బుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ఏడు మండలాల్లో వర్షం
కొరిటెపాడు(గుంటూరు)ః గుంటూరు జిల్లాలో అక్కడక్కడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఏడు మండలాల్లో వర్షం పడింది. పొన్నూరు మండలంలో 16.4 మిల్లీమీటర్లు, పెదకాకాని 7, గుంటూరు పశ్చిమ 5.2, గుంటూరు తూర్పు 5, వట్టిచెరుకూరు 3.2, తాడేపల్లి 1.8, ప్రత్తిపాడు మండలంలో 1 మి.మీ చొప్పున వర్షం పడింది. సెప్టెంబర్ మాసం 26వ తేదీ వరకు సాధారణ వర్షపాతం 121.8 మి.మీ పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 187.6 మి.మీ వర్షపాతం నమోదైంది. రాగల రెండు రోజులూ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
నిమ్మకాయల ధరలు
తెనాలిటౌన్: గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయల కనిష్ట ధర రూ.4,000, గరిష్ట ధర రూ.6,000, మోడల్ ధర రూ.5,000 వరకు పలికింది.

