గుంటూరు: భార్య, భర్తల నడుమ స్వల్ప వివాదాలు జరుగుతున్న నేప థ్యంలో భర్తకు తెలియకుండా భార్య విదేశానికి వెళ్లిపోవడంతో మనస్థాపానికి గురైన భర్త ఉరి పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ఈపూరుకు చెందిన ఆలూరి సార్వభౌమ (31)కు మూడేళ్ల క్రితం చెరుకుపల్లి మండలం గూడవల్లికి చెందిన పూర్ణిమ అనే యువతితో వివాహం జరిగింది. హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్న దంపతు ల నడుమ గత కొద్ది నెలలుగా మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి.
అప్పట్నుంచి సార్వభౌమ ఈపూరులో తన గృహ నిర్మాణ పనులు చూసుకుంటూ ఇంటి వద్ద నుంచే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. పెద్దలు ఇరువురి నడుమ సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఇటీవల తన భార్య ఫోన్‌లలో సైతం స్పందించక పోవడంతో ఆమె సమాచారం తెలుసుకునేందుకు తన అత్తగారి ఇంటికి మృతుడు వెళ్లగా సరైన సమాధానం లభించలేదు.
ఇటీవల తన భార్య తనకు చెప్పకుండా లండన్ వెళ్లినట్లు తెలుసుకున్న సార్వభౌమ మనస్థాపంతో బాధపడ్డాడు. బుధవారం తెల్లవారుజామును అతని తల్లి నిద్రలేచి రోజువారి పనులు చేసుకునేందుకు బయటకు వచ్చిన క్రమంలో డాబా మెట్ల వద్ద ఉన్న సిమెంట్ పిల్లరుకు ఉరి పెట్టుకుని వేలాడుతూ ఉండటం గమనించి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఉరి నుంచి తప్పించి, పరీక్షించగా అప్పటికే మృతి చెందాడు.
మృతుడి తల్లి తన కోడలు కారణంగానే తన కుమారుడు మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు ఎస్‌ఐ జి.రాజ్యలక్ష్మి తెలిపారు. మృతదేహాన్ని వేమూరు సీఐ వెంకటేశ్వర్లు, ఏఎస్‌ఐ రామయ్యలు పరిశీలించి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment