
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (జీడీసీఎంఎస్) పాలకవర్గం పదవీకాలాన్ని ఆరు మాసాల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 21వ తేదీవరకు పదవీ కాలం ఉండగా.. దానిని జూలై 21వ తేదీవరకు పొడిగిస్తూ సహకార శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జి కమిటీ చైర్‌పర్సన్‌గా యార్లగడ్డ భాగ్యలక్ష్మి, సభ్యులుగా ఎ.వెంకటశివ, ఎ.విజయ భాస్కరరెడ్డి, పి.బాలగురవమ్మ, పి.ఆదినారాయణ, దాసరి రాజు, కుర్రా పాములు ఉన్నారు. ఈ మేరకు కన్నావారితోట లోని జీడీసీఎంఎస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం భాగ్యలక్ష్మి చైర్‌పర్సన్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించారు. జీడీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ డి.హరిగోపాలం, కార్యాలయం మేనేజర్ కె.శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
75 మంది ఎస్‌ఐలు బదిలీ
నగరంపాలెం: గుంటూరు రేంజ్ పరిధిలో 75 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ జి.పాలరాజు ఉత్తర్వులు జారీచేశారు. గుంటూరు జిల్లాలో 16, పల్నాడు జిల్లాలో 7, బాపట్ల జిల్లాలో 8, ప్రకాశం జిల్లాలో 20, ఎస్‌పీఎస్ నెల్లూరు జిల్లాలో 17, తిరుపతి జిల్లాలో ఏడుగుర్ని బదిలీ చేశారు.
యార్డులో 1,15,589 బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు సోమవారం 1,15,589 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,04,121 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.8,500 నుంచి రూ.20,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి 21,000 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.12,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 52,793 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఇన్‌చార్జి కార్యదర్శి కాకుమాను శ్రీనివాసరావు తెలిపారు.
దుర్గమ్మ సన్నిధిలో
ఆంధ్ర నృత్య ప్రదర్శన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో విజయవాడకు చెందిన శ్రీనటరాజ నృత్యాలయంకు చెందిన పలువురు చిన్నారులు ప్రదర్శించిన ఆంధ్ర నాట్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట కళావేదికపై నృత్యాలయానికి చెందిన అంజలి, పూజిత, హేమ, రేష్మా, పూజ, భవ్యశ్రీ, శ్రావణిలతో పాటు పలువురు చిన్నారులు పలు కీర్తనలకు నృత్య ప్రదర్శన ఇచ్చారు. అనంతరం చిన్నారులకు అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ అధికారులు ప్రసాదాలు అందచేశారు.
రైతుకు గిట్టుబాటు
ధర కల్పిస్తాం
చిలకలపూడి(మచిలీపట్నం): తుపానుకు దెబ్బతిన్న వరి పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులకు తగిన న్యాయం చేస్తామని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశపు హాలులో జిల్లా వ్యవసాయ సలహామండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. వరి కుప్పలను నూర్పిడి చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కొంత మంది రైతులకు ధాన్యం బకాయిలు రావాల్సి ఉందని కమిటీ సభ్యులు జేసీ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై జేసీ స్పందిస్తూ సేకరించిన ధాన్యానికి ఇప్పటి వరకు రూ.637 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమచేశామన్నారు. సాంకేతిక సమస్యల వల్ల పెండింగ్‌లో ఉన్న నగదును త్వరలో జమ చేస్తామని స్పష్టంచేశారు.వ్యవసాయ సలహామండలి సభ్యులు శ్రీకాకోళపు నాగేశ్వరరావు, పట్టపు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
