తెనాలిరూరల్: తెనాలి పట్టణ గంగానమ్మపేటలోని భవనంవారి వీధిలో వివాహిత రామిశెట్టి అలేఖ్య(35) ఈ నెల 15వ తేదీన దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆమెతో వివాహేతర సంబంధం ఉన్న ఆటో డ్రైవరే హత్యకు పాల్పడ్డాడని పోలీసులు నిర్దారణకు వచ్చారు. తనతోపాటు మరొకరితో చనువుగా ఉంటోందన్న కారణంతో ఆమెను హతమార్చాడని పోలీసుల విచారణలో వెల్లడైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. అలేఖ్యకు బాలాజీరావుపేటకు చెందిన ఆటో డ్రైవర్ అన్నం శ్రీనివాసరావుతో కొంత కాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వీరిరువురూ గతంలో ఒకసారి ఇంటి నుంచి వెళ్లిపోగా భర్త రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేసి తిరిగి రప్పించుకున్నారు.
ఈ క్రమంలో భార్యను హెచ్చరించి ఇక ఇటువంటి పనులు మానేయాలని భర్త ఆదేశించాడు. శ్రీనివాసరావు రమేష్‌పై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపర్చాడు. దీనిపై బాధితుడు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్యాయత్నం కేసు నమోదైంది. త్వరలో కేసు విచారణకు రానుంది. కాగా ఒంటరిగా గదిలో ఉన్న అలేఖ్య వద్దకు వచ్చిన శ్రీనివాసరావు తెల్లవారుజాము వరకూ అక్కడే ఉన్నాడు. అనంతరం ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో ఆమెను హత్య చేసి పరారైనట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. శ్రీనివాసరావు సమీప బంధువైన బాలాజీరావుపేటకే చెందిన వ్యక్తితో అలేఖ్య చనువుగా ఉంటోంది. దీనికితోడు ఆ వ్యక్తి ఇటీవలి కాలంలో అలేఖ్య ఇంటి సమీపంలోని ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు.
దీంతో వీరిద్దరి మధ్య చనువు మరింత పెరిగి తరచూ కలుస్తూ ఉన్నారు. ఈ విషయం శ్రీనివాసరావుకు తెలియడంతో ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. 14వ తేదీ అర్ధరాత్రి దాటాక అలేఖ్యతో మామూలుగా మాట్లాడుతున్నట్టే మాట్లాడాడు/మెసేజ్‌లు పెట్టాడు. ఆమె సూచించిన సమయానికి ఇంటికి వెళ్లాడు. సుమారు రెండు గంటలపాటు ఆమెతోనే గడిపి చివరకు తన వెంట తెచ్చుకున్న పదునైన వస్తువుతో గొంతు కోసి హతమార్చి పరారయ్యాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్ చూపే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment