చికెన్‌పై అపోహలు తొలగాలి
కలెక్టర్ నాగలక్ష్మి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): చికెన్ వినియోగంపై ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగించేందుకు పశుసంవర్ధక శాఖ, పౌల్ట్రీ ఫార్మర్స్ సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో బర్డ్‌ఫ్లూ వైరస్.. చికెన్ వినియోగం అంశంపై పశు సంవర్ధక శాఖ అధికారులు, ఏపీ పౌల్ట్రీ ఫార్మర్స్ ఫెడరేషన్ సభ్యులతో ఆమె సమావేశమయ్యారు. జిల్లాలో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు లేవని పశు సంవర్ధక శాఖ అధికారులు, పౌల్ట్రీ ఫార్మర్స్ కలెక్టర్‌కు వివరించారు. సోషల్ మీడియాలో చికెన్, కోడిగుడ్ల వినియోగంపై అసత్యప్రచారం జరుగుతోందని చెప్పారు.ఉడికించిన చికెన్, కోడిగుడ్లను తినడం వల్ల ఎలాంటి వైరస్‌లూ సోకవని వైద్యులు నిర్ధారించారని పేర్కొన్నారు. ప్రజల్లో అపోహల తొలగింపునకు పశుసంవర్ధక శాఖ, వైద్యారోగ్యశాఖతో కలిసి ఏపీ పౌల్ట్రీ ఫార్మర్స్ ఫెడరేషన్ ఫిబ్రవరి 21న చికెన్, ఎగ్ మేళాను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రజల్లో అపోహల తొలగింపునకు విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. చికెన్ , ఎగ్ మేళాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో పశుసంవర్దక శాఖ జిల్లా అధికారి డాక్టర్ ఒ. నరసింహరావు, ఏపీ పౌల్ట్రీ ఫార్మర్స్ ఫెడరేషన్ చైర్మన్ వై సురేష్, సభ్యులు నాగేశ్వరరావు, కె గిరిధర్, కిషోర్, వెంకయ్య, రాంబాబు, కిరణ్, జాకీర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment