ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి
తురకపాలెం(ముప్పాళ్ల): ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో పంట కాల్వలో వ్యక్తి బోర్లా పడి మృతి చెందిన సంఘటన గురువారం మండలంలోని గోళ్లపాడు గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పంట కాల్వలో మృతదేహం ఉన్నట్లు గుర్తించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరిన వారు మృతదేహాన్ని కాల్వలోంచి బయటకు తీశారు. మండలంలోని తురకపాలేనికి చెందిన మక్కెన ఇన్నయ్య(45)గా గుర్తించారు. తలపైన తీవ్ర గాయంతో పాటుగా ముక్కుల వెంబడి రక్తం కారుతూ ఉండటంతో మొదట అనుమానాస్పద మృతిగా భావించారు. తర్వాత పోలీసులు విచారణ జరపగా తురకపాలెం గ్రామానికి చెందిన ఇన్నయ్య కొంకావారిపాలెం చేపల చెరువుకు కాపలా ఉండే చల్లంచర్ల ఏసురాజు అనే యువకుడితో కలిసి ద్విచక్ర వాహనంపై గోళ్లపాడు వైపు బయలుదేరారు. మార్గంమధ్యలో వాహనం అదుపు తప్పి ఇద్దరూ కిందపడి స్పృహ కోల్పోయారు. వాహనం వెనకాల కూర్చున ఇన్నయ్య కిందపడి తలకు గాయమై కాల్వలో జారిపోయాడు. చీకట్లో కనిపించకపోవడంతో ఏసురాజు తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. తెల్లవారిన తర్వాత ఇన్నయ్య కాల్వలో మృతి చెందాడని తెలియడంతో ఏసురాజు జరిగిన సంఘటన తీరును పోలీసులకు వివరించాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. భార్య ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వి.సోమేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment