● ప్రముఖ విద్యా సంస్థ నుంచి ఐదుగురు అదృశ్యం ● సత్తెనపల్లి పోలీసులకు అభినందనలు తెలిపిన హోం మంత్రి అనిత
సత్తెనపల్లి: అదృశ్యమైన ఐదుగురు మైనర్ విద్యార్థినులను పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులు గురువారం రక్షించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలోని ఓ ప్రముఖ విద్యాసంస్థలో చదువుతున్న ముస్తాబాద్‌కు చెందిన ఐదుగురు మైనర్ విద్యార్థినులు అదృశ్యం కావడంతో వారి బంధువులు గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన గన్నవరం పోలీసులు సాంకేతికతను వినియోగించి, విద్యార్థినులు సత్తెనపల్లి మీదుగా హైదరాబాద్ వెళుతున్నట్లు గుర్తించారు. వెంటనే సత్తెనపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు ఆధ్వర్యంలో సీఐ బొప్పన బ్రహ్మయ్య, ఏఎస్‌ఐ రమణ, సిబ్బంది దరియావలి, సలీం, దశరథ్‌నాయక్‌లు ఉదయం 6:30–7:00 గంటల మధ్య విజయవాడ–నల్గొండ వెళుతున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో తనిఖీలు నిర్వహించారు. ఐదుగురు విద్యార్థినులను అదుపులోకి తీసుకొని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. గన్నవరం పోలీసుల సమాచారం మేరకు సత్వరమే స్పందించి విద్యార్థినులను రక్షించిన సత్తెనపల్లి పోలీసులను రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ట్విట్టర్ ద్వారా, ఫోన్‌లో అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment