ప్రకృతి సేద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
కొరిటెపాడు(గుంటూరు): ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు వెలుగూరి రాధాకృష్ణమూర్తి కోరారు. ఈ మేరకు గురువారం ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో గుంటూరులోని రైతు సాధికార సంస్థ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయం సీఈవో రామారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో 15 వేల మంది ప్రకృతి వ్యవసాయంలో భాగస్వాములై అనేక క్యాడర్లలో తొమ్మిది ఏళ్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనం అమలు చేయాలన్నారు. రైతులకు సమాచారం చేరవేసే విషయంలో కష్టపడి పనిచేస్తున్న అనేక క్యాడర్ల ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. వారిని అర్ధాంతరంగా తొలగించే విధానాన్ని ఆపాలని సూచించారు. అంతేకాకుండా తొలగించిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం, హెచ్‌ఆర్ పాలసీని అమలు చేయాలని పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వేతనాల పెంపు కోసం ప్రత్యేక నిధులు కేటాయించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. మహిళలకు భద్రత కల్పించాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో యూనియన్ రాష్ట్ర నాయకులు సునీల్ కుమార్, విజయలక్ష్మి,శ్రీనివాసరావు, శ్రీధర్, ఎం.రమేష్‌బాబు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment