గిరిజన భాషలకు సువర్ణమాల
● 19 భాషలకు లిపి రూపొందించిన ప్రొఫెసర్ ● ఏకేఎన్‌యూ వీసీ స్థాయికి ఎదిగిన వైనం ● ‘నారీశక్తి’ చాటిన మహిళామూర్తి సాతుపాటి ప్రసన్నశ్రీ
తెనాలి: సాతుపాటి ప్రసన్నశ్రీ.. గిరిజన భాషల అక్షరశిల్పి ఆమె.. గిరిజన భాషలు అంతరించిపోకూడదనే మహోన్నత ఆశయంతో సొంత లిపి రూపొందించారు. ఇందుకోసం భారతదేశంలోని గిరిజన తండాలను సందర్శించారు. ఆ భాషలపై అధ్యయనం చేశారు. మొత్తం 19 గిరిజన భాషలకు లిపిని సిద్ధంచేశారు. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక నారీశక్తి పురస్కారాన్ని అందుకున్నారు. ఈ ఇంగ్లిష్ ప్రొఫెసర్ ఇప్పుడు రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి(ఏకేఎన్‌యూ) ఉపకులపతి అయ్యారు.
పూర్వీకులది స్టువార్టుపురం
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని స్టువార్టుపురం ప్రసన్నశ్రీ పూర్వీకుల ఊరు. ఒకప్పుడు పేరుమోసిన దొంగలకు నిలయమైన ఈ ఊరిలో సామాజికవేత్త హేమలతా లవణం వారిలో పరివర్తనకు కృషిచేశారు. ఫలితంగా అక్కడ నేరప్రవృత్తి కలిగిన పలువురు మారి చదువుకుని ఉద్యోగాలు చేపట్టారు. ఎందరో ఉన్నతస్థానాలకు చేరారు. హేమలతా లవణం వంటి ప్రముఖులతో కలిసి ప్రసన్నశ్రీ తాత ఆ కృషిలో భాగస్వామి అయ్యారు. ఆయన కుమారుడు ప్రసాదరావు చదువుకుని రైల్వే ఉద్యోగం చేపట్టారు. పలు ప్రాంతాల్లో పనిచేశారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి
నుంచి వీసీ స్థాయికి..
గుంటూరు జిల్లాలోని సీతాగనరంలో ప్రసాదరావు స్థిరపడ్డారు. ఆయన కుమార్తె ప్రసన్నశ్రీ పలు ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేశారు. సర్దార్ పటేల్ మహావిద్యాలయంలో పీహెచ్‌డీ చేసిన ఆమె తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా రెండు దశాబ్దాలకుపైగా పనిచేశారు. ఇప్పుడు ఆదికవి నన్నయ వర్సిటీ(ఏకేఎన్‌యూ) వీసీ స్థాయికి ఎదిగారు.
19 భాషలపై పరిశోధనలు
ఎస్టీ ఎరుకల సామాజికవర్గానికి చెందిన ప్రసన్నశ్రీ, లిపి లేని గిరిజన భాషలు అంతరించిపోతుండటంపై ఆవేదన చెందారు. గిరిజనుల వెనుకబాటుకు అక్షరాస్యతే లోపమని భావించారు. భిన్న సంస్కృతులు, జీవన విధానాలు కలిగిన గిరిజనుల జీవితాల్లో మార్పు రావాలంటే, అక్షరాలు ముఖ్యమని గ్రహించారు. ఆయా భాషలకో అక్షర లిపి కనుగొనాలని నిర్ణయించుకున్నారు. దేశవ్యాప్తంగా పర్యటించారు. గిరిజన తండాలకు వెళ్లారు. అక్కడ జరిగే సంతలు, పండగుల్లో గిరిజనుల జీవన స్థితిగతులు, భాషలపై పరిశోధనలు చేశారు. గోండు, కోయ, బగట వంటి 19 గిరిజన తెగలు మాట్లాడుకునే భాషలకు సొంతంగా లిపిని రూపొందించారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులోని గిరిజనులకూ ఓ లిపిని సిద్ధంచేశారు.
వరించిన పురస్కారాలు
ప్రసన్నశ్రీ పరిశోధనలకు గుర్తింపు లభించింది. 2021లో అప్పటి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి నారీశక్తి పురస్కారాన్ని ప్రసన్నశ్రీ అందుకున్నారు. 19 గిరిజన భాషలకు అక్షర మాలలు రాసిన ఘనతకు అమెరికాలో మరో ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని కూడా ఆమె స్వీకరించారు. 125 పరిశోధన వ్యాసాలు రాశారు. తన కృషికి ఇప్పటి వరకు 16 జాతీయ అవార్డులు, 15 అంతర్జాతీయ అవార్డులు అందుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఆమె నియమితులయ్యారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.
గిరిజన భాషలకు సువర్ణమాల
గిరిజన భాషలకు సువర్ణమాల
Comments
Please login to add a commentAdd a comment