అక్రమాలకు తెగబడిన అధికార పార్టీ
మంగళగిరి టౌన్: కృష్ణా గుంటూరు జిల్లాల శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు తెగబడుతోందని పీడీఎఫ్ అభ్యర్థి కె.ఎస్. లక్ష్మణరావు తీవ్రంగా విమర్శించారు. మంగళగిరి పట్టణ పరిధిలోని సీకే హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలోని దుర్గి, బెల్లకొండతో పాటు మరికొన్ని మండలాల్లోని బూత్‌లలో తమ ఏజెంట్లను బయటకు పంపించి వేశారని తెలిపారు. ఇదేమి న్యాయం ? అని ప్రశ్నించారు. చేతనైతే తలపడాలి గానీ ఏజెంట్లను బయటకు పంపడం ఏమిటని మండిపడ్డారు. తెనాలిలోని మున్సిపల్ హైస్కూలులోని ఏడు బూత్‌లలో ఓ వ్యక్తి పెద్దఎత్తున దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నం చేశాడని ఆయన పేర్కొన్నారు. మంగళగిరిలో కూడా అదేవిధంగా జరుగుతోందని విమర్శించారు. అధికార పార్టీ నేతలు పోలింగ్ కేంద్రాల గేట్లు వరకు వచ్చి ప్రచారం చేసుకుంటున్నారని, తాము ప్రచారం చేసుకోకూడదా ? అంటూ ప్రశ్నించారు. అధికార పార్టీ అరాచకాలపై. ప్రజాస్వామ్య వ్యతిరేక పద్ధతులపై ఎన్నికల సంఘ అధికారి వివేక్ యాదవ్‌కు, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
లక్ష్మణరావు కుమారుడి డ్రైవర్‌పై
దాడికి యత్నం
పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి లక్ష్మణరావు మంగళగిరి సీకే హైస్కూల్‌లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆ సమయంలో లక్ష్మణరావు కుమారుడు, కారు డ్రైవర్‌పై పలువురు దాడికి యత్నించారు. కారు డ్రైవర్ టీడీపీ ఏజెంట్లను ఫోన్‌లో వీడియోలు తీస్తున్నాడంటూ కార్యకర్తలు అతడిపై ఎగబడ్డారు. ఇంతలో లక్ష్మణరావు కుమారుడు కార్ డ్రైవర్‌ను ఆపే ప్రయత్నంలో భాగంగా ఇద్దరి మధ్యా తోపులాట జరిగింది. అది ఘర్షణకు దారి తీసింది. లక్ష్మణరావు కుమారుడు, కారు డ్రైవర్‌పై అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు చేయి చేసుకున్నారు. అక్కడున్న పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా కూడా కార్యకర్తలు దాడికి యత్నించారు. పోలీసులు అడ్డుకుని ఇరువర్గాల వారిని అక్కడి నుంచి పంపించివేశారు.
ఎన్నికల ప్రక్రియను
పరిశీలించిన సబ్ కలెక్టర్
మంగళగిరిలో జరుగుతున్న కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా గురువారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల అవతల మాత్రమే ఏజెంట్లు ఉండాలని, ఆలోపు ఉన్నవారిని అక్కడి నుంచి పంపాలని అధికారులను ఆదేశించారు. అయినా కూటమి నేతలు అక్కడి నుంచి కదలకపోవడంతో పోలీసుల సహాయంతో 100 మీటర్ల అవతల కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. స్వయంగా సిబ్బందితో కలసి ఆమె టేబుల్స్‌ను 100 మీటర్ల అవతలకు తరలించారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి
కె.ఎస్. లక్ష్మణరావు ధ్వజం
అక్రమాలకు తెగబడిన అధికార పార్టీ
అక్రమాలకు తెగబడిన అధికార పార్టీ
Comments
Please login to add a commentAdd a comment