విజయోస్తు.. ఉత్తీర్ణత ప్రాప్తిరస్తు
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. శనివారం ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా హాజరు కానున్న 71,528 మంది విద్యార్థుల కోసం 87 పరీక్ష కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ప్రథమ సంవత్సర పరీక్షలకు 35,688 మంది, ద్వితీయ సంవత్సర పరీక్షలకు 35,946 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8.30 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 9 గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ రోజే పరీక్ష
గుంటూరులోని ఏసీ కళాశాలలో ఈనెల 3వ తేదీన కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా అదే రోజు కళాశాలలో సీనియర్ ఇంటర్ విద్యార్థులకు పరీక్ష జరగనుంది. కళాశాల ప్రధాన గేటు మీదుగా అసెంబ్లీ హాలుతో పాటు ప్రధాన బ్లాక్‌ను కౌంటింగ్‌కు కేటాయించారు. ఇంటర్మీడియెట్ పరీక్షల కోసం పక్కనే ఉన్న లా కళాశాల గేటు నుంచి ఏసీ కళాశాల వెనుక వైపు తరగతి గదుల్లోకి ప్రవేశించే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు జూనియర్, సీనియర్ ఇంటర్ విద్యార్థులు ప్రత్యామ్నాయంగా కేటాయించిన తరగతి గదుల్లోనే పరీక్షలు రాయాలని ప్రిన్సిపాల్ కె.మోజెస్ చెప్పారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా, రూట్ మ్యాప్ సిద్ధం చేసి, పరీక్ష కేంద్రంలోకి పంపే ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఇంటర్మీడియెట్ విద్యార్థులను ఏసీ లా కళాశాల ద్వారం నుంచి అనుమతించనున్నట్లు తెలిపారు.
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు గుంటూరు జిల్లాలో 87 కేంద్రాల్లో నిర్వహణ ఉదయం 9 గంటల తరువాత నో ఎంట్రీ 3న గుంటూరులోని ఏసీ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కౌంటింగ్‌కు, పరీక్షలకు వేర్వేరుగా ఏర్పాట్లు చేసిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment