ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులకు వృద్ధురాలు మృతి
యాజలి(కర్లపాలెం): ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధుల వేధింపులతో మనోవేదనకు గురై ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. యాజలికి చెందిన తూపరి రోజానమ్మ కుమారుడు తూపరి చిన్‌రావు, మనవడు నాని ఇల్లు కట్టుకునేందుకు రేపల్లెలోని ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో రెండేళ్ల కిందట రుణం తీసుకున్నారు. అప్పటి నుంచి వరుసగా 15నెలల పాటు కిస్తీలు చెల్లించారు. అనంతరం చిన్‌రావు భార్య మరియమ్మ అనారోగ్యానికి గురికావటంతో చెల్లించటం కష్టమైంది. ఐదు నెలలు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు గురువారం ఇంటికి వచ్చి నగదు చెల్లించమని కోరారు. తమవద్ద రూ.30వేలు ఉన్నాయని, మిగతావి వచ్చే నెలలో చెల్లిస్తామని చెప్పినా తీసుకోకుండా ఇంటికి సీల్ వేశారు . దీంతో చిన్‌రావు తల్లి రోజానమ్మ మనోవేదనతో అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు శనివారం ఉదయం బాపట్ల ఏరియా వైద్యశాలకు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment