గుడ్‌ ఓపెనింగ్‌ | - | Sakshi
Sakshi News home page

గుడ్‌ ఓపెనింగ్‌

Published Sun, Mar 2 2025 2:15 AM | Last Updated on Sun, Mar 2 2025 2:14 AM

గుడ్‌

గుడ్‌ ఓపెనింగ్‌

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సర విద్యార్థులకు శనివారం పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా 87 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఆర్ట్స్‌, సైన్స్‌ కోర్సుల్లో 33,783 మంది విద్యార్థులకు గానూ 33,072 మంది, ఒకేషనల్‌ కోర్సుల్లో 1,287 మందికి గానూ 1,155 మంది హాజరయ్యారు. నిమిషం ఆలస్యంగా వచ్చినా కేంద్రాల్లోకి అనుమతించబోమని అధికారులు చేసిన హెచ్చరికలతో విద్యార్థులు ఉదయం 8 గంటలకే కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 8.45 గంటలకు అధికారులు లోపలకు అనుమతించారు. 9 గంటలకు ప్రశ్నపత్రం పంపిణీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరిగింది.

దూర ప్రాంతాల్లో కేంద్రాలతో అవస్థలు

గుంటూరు నగరంతో పాటు వివిధ మండలాల పరిధిలో కేటాయించిన పరీక్ష కేంద్రాలు దూరంగా ఉండటంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. ప్రధానంగా గుంటూరు నగరంలో డొంక రోడ్డు మూసివేత కారణంగా ఉదయం 8 గంటల నుంచి విద్యార్థులు ఇరువైపులా పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఒక్కసారిగా రాకపోకలు సాగించడంతో అక్కడ ట్రాఫిక్‌ స్తంభించింది. సంగడిగుంటకు చెందిన వివిధ ప్రైవేటు కళాశాలల్లోని విద్యార్థులకు ఇన్నర్‌రింగ్‌ రోడ్డులో కేంద్రాలను కేటాయించడంతో, వాటిని చేరుకునేందుకు సరైన మార్గం లేక ఇబ్బందులు పడ్డారు. మూడు నెలలుగా కొనసాగుతున్న డొంక రోడ్డు మూడు వంతెనల మార్గం పరీక్షల సమయానికి కూడా పూర్తి కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పిల్లలను సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేర్చడంలో తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. కాగా సోమవారం సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

సజావుగా జూనియర్‌ ఇంటర్‌ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతం గుంటూరులోని ఓ పరీక్ష కేంద్రంలో 10 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నపత్రం విద్యార్థులకు అదనంగా 10 నిమిషాలు కేటాయింపు గుంటూరు జిల్లాలో 87 కేంద్రాల పరిధిలో 34,227 మంది హాజరు 35 కేంద్రాల్లో అధికారులు విస్తృత తనిఖీలు

పరీక్ష ఆలస్యం

గుంటూరు విద్యానగర్‌లోని మ్యాట్రిక్స్‌ జూనియర్‌ కళాశాలలో ఓ రూములో విద్యార్థులకు 10 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నపత్రం ఇచ్చారు. 9.10 గంటలకు ఇవ్వడంతో విద్యార్థులకు అదనంగా ఆ సమయాన్ని కేటాయించారు. విషయం తెలుసుకున్న ఆర్‌ఐవో జీకే జుబేర్‌ ప్రశ్నపత్రం జాప్యంపై విచారణ జరిపించారు. మొదటి రోజు కావడంతో కొంత జాప్యం జరిగిందని, దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. ఇది మినహా ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ 20 కేంద్రాలను తనిఖీ చేసింది. సిట్టింగ్‌ స్క్వాడ్స్‌ ఎనిమిది, ఆర్‌ఐవో మూడు, ఇతర బృందాలు నాలుగు చొప్పున తనిఖీలు నిర్వహించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
గుడ్‌ ఓపెనింగ్‌1
1/1

గుడ్‌ ఓపెనింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement