వైఎస్సార్ సీపీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామక
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాకు పలువురిని పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు శనివారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన వాసిమళ్ల విజయ్‌కుమార్, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా చిన్నాబత్తిన వినోద్ కుమార్, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా తాడికొండ నియోజకవర్గానికి చెందిన దాసరి రాజు, గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడిగా రేపూడి రంజన్‌బాబు, ఆర్టీఐ విభాగం అధ్యక్షుడిగా గుంటూరు పశ్ఛిమ నియోజకవర్గానికి చెందిన కోటా చిన్నపరెడ్డి, దివ్యాంగుల విభాగం అధ్యక్షుడిగా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన బొక్కా అగస్టీన్, డాక్టర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన డాక్టర్ చదలవాడ రవీంద్రనాథ్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
భక్తిశ్రద్ధలతో
పుష్ప శయనోత్సవం
పెదకాకాని: స్థానిక శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం భక్తిశ్రద్ధలతో పుష్ప శయనోత్సవాన్ని నిర్వహించారు. మహా శివరాత్రి వేడుకల్లో భాగంగా చివరి రోజు అమ్మవారు పుష్పశయ్య అలంకరణలో దర్శనమిచ్చారు. ఉదయం సుప్రభాతసేవ, హారతులతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహా నివేదన, పంచహారతులు, ద్వాదశ ప్రదక్షిణాలు, ఫల ప్రదానం, పవళింపు సేవను అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శివరాత్రి వేడుకలు ముగిసినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ పేర్కొన్నారు. ఉత్సవాలు విజయవంతం కావడానికి సహకారాలు అందించిన ప్రభుత్వ శాఖల అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు
నగరంపాలెం : ఉమ్మడి కృష్ణా –గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లను శనివారం రాత్రి జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ పరిశీలించారు. కళాశాల ఆవరణలోని పలు విభాగాలు సందర్శించారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి వచ్చే సిబ్బంది, ఆయా పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లను నిశితంగా పరిశీలించి అనుమతించాలని సూచించారు. స్ట్రాంగ్ రూములో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను లెక్కింపు కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కేంద్రం భద్రతా ఏర్పాట్లకు తగినంత పోలీసు అధికారులు, సిబ్బందిని బందోబస్తుకు నియమించినట్లు ఎస్పీ సతీష్‌కుమార్ వెల్లడించారు. లెక్కింపు సిబ్బంది, ఏజెంట్లు ద్విచక్రవాహనాలను ఏసీ కళాశాల ఎదురు రాష్ట్ర గ్రంథాలయం, బౌద్ధ మ్యూజియంలో నిలుపుదల చేయాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులు తమ వాహనాలను ఏసీ న్యాయ కళాశాలలో పార్కింగ్ చేసుకోవాలన్నారు. పోలీసు శాఖ వాహనాలను సీఐడీ కార్యాలయం ఎదురు ఉన్న ఖాళీ స్థలంలో పార్కింగ్ చేయాలని ఎస్పీ సూచించారు. జిల్లా ఏఎస్పీ హనుమంత్, తూర్పు డీఎస్పీ అబ్దుల్ అజీజ్, ఏఆర్ డీఎస్పీ ఏడుకొండలురెడ్డి, తహసీల్దార్లు, సీఐలు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామక
Comments
Please login to add a commentAdd a comment