కౌంటింగ్‌లో అప్రమత్తత అవసరం
గుంటూరు వెస్ట్: ఉమ్మడి కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. స్థానిక ఏసీ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన శిక్షణలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, తెనాలి, నూజివీడు సబ్ కలెక్టర్లు సంజనా సింహా, స్మరణ్ రాజ్‌తో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బ్యాలెట్ పేపర్ల లెక్కింపులో ఏకాగ్రతతో, సమర్థంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. చెల్లుబాటు అయ్యే ఓట్లు, చెల్లని ఓట్లకు సంబంధించి ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలపై కౌంటింగ్ సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. కౌంటింగ్ సూపర్‌వైజర్లు, రో ఇన్‌చార్జిలు, నిరంతరం కౌంటింగ్ విధానాన్ని పర్యవేక్షిస్తూ సిబ్బందికి అవసరమైన సూచనలు, సహాయం అందించాలని చెప్పారు. ప్రారంభం నుంచి కౌంటింగ్ ముగిసేవరకు పాటించాల్సిన అన్ని అంశాలు మరిచిపోకూడదని తెలిపారు. పోటీలో ఉన్న అధిక మెజార్టీ వచ్చిన అభ్యర్థుల ఓట్లలో తదుపరి ప్రాధాన్యత ఓట్లను ఇతర అభ్యర్థులకు కేటాయిస్తూ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుందని వివరించారు. ఇటీవల ముసిగిన శాసనమండలి ఎన్నికలు 483 పోలింగ్ బూత్‌లలో జరిగాయన్నారు. ఓట్ల లెక్కింపు 28 టేబుల్స్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రతి టేబుల్‌కు కౌంటింగ్ సిబ్బందితోపాటు, సూపర్‌వైజర్, రో ఇన్‌చార్జి, షిప్ట్ ఇన్‌చార్జిలను నియమించామని చెప్పారు ఓట్ల లెక్కింపునకు మూడు షిఫ్ట్‌లలో ఉద్యోగులు పనిచేస్తారని తెలిపారు. బ్యాలెట్ పేపర్లను అత్యంత జాగ్రత్తగా హ్యాండిలింగ్ చేయాలని సూచించారు. ముందుగా సక్రమంగా ట్రేలలో సర్దుకొని కౌంటింగ్ ప్రారంభించాలని తెలిపారు. మరిన్ని అంశాలను కలెక్టర్, అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సిబ్బందికి తెలియజేశారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment