గొట్టిపాడు శివాలయంలో చోరీ
ప్రత్తిపాడు: గొట్టిపాడు శివాలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడి దేవతామూర్తుల బంగారు, వెండి నగలను అపహరించుకుపోయిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడులోని శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి దేవస్థానం అర్చకులు ఆదివారం రాత్రి ఎప్పటిలానే పూజలు నిర్వహించి తాళాలు వేసి వెళ్లిపోయారు. అర్ధరాత్రి సుమారు ఒంటిగంట సమయంలో గుర్తుతెలియని దుండగులు ముఖానికి మాస్కు, చేతికి గ్లౌజులు ధరించి ఆలయంలోకి ప్రవేశించారు. ప్రధాన ద్వారానికి ఉన్న పెద్ద పెద్ద తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో, ఇనుప కడ్డీలు వంచి గుడి లోపలకు చొరబడ్డారు. నాలుగు కేజీల కాశీవిశ్వేశ్వరుని వెండి నాగాభరణంతో పాటు సుమారు నలభై గ్రాముల అమ్మవారి బంగారు తాళి బొట్టుతాడు, తాళిబొట్లు రెండు, ముక్కెర, బంగారు బొట్టు బిళ్ల, ఉత్సవమూర్తుల వెండి వస్తువుల అపహరించుకుపోయారు. వీటి విలువ ఎనిమిది లక్షల రూపాయలపైన ఉంటుందని చెబుతున్నారు. సోమవారం ఉదయం గ్రామస్తుడు వెలివెల్లి శ్రీనివాసరావు ఆలయంలో ప్రదక్షిణలు చేసేందుకు వెళ్లాడు. అప్పటికే ఉత్తరం వైపు ద్వారాలతో పాటు తూర్పువైపు ద్వారాలు తీసి ఉండటంతో విషయాన్ని గ్రామస్తులకు, ఆలయ అర్చకులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న వ్యవస్థాపక ధర్మకర్త పచ్చల అప్పారావు ఆలయానికి వచ్చి చూశారు. అప్పటికే దేవతామూర్తుల ఆభరణాలు కనిపించకపోవడంతో ప్రత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ జి. శ్రీనివాసరావు, ఎస్‌ఐ కె. నాగేంద్రలు దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. స్థానికంగా ఆలయం సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. క్లూస్ టీమ్‌కు సమాచారం అందించడంతో రంగంలోకి దిగి వేలిముద్రలను సేకరించింది. అర్చకుడు బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
స్వామి వారి వెండి కిరీటంతో పాటు
అమ్మవారి బంగారు నగల అపహరణ
Comments
Please login to add a commentAdd a comment