కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ వర్కర్స్ నిరసన
లక్ష్మీపురం: ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు, మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల రవికుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మున్సిపల్ కార్మికులకు అనేక హామీలు ఇచ్చిందన్నారు. తీరా గద్దె నెక్కాక వాటిని మరిచిందని విమర్శించారు. అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్‌ను రద్దు చేసి దాని స్థానంలో ప్రైవేట్ కంపెనీలకు, ఏజెన్సీలకు ఇచ్చే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే ఉద్యోగుల జీవితాలతో వారు చెలగాటం ఆడతారని తెలిపారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులను పెంచాలని కోరారు. విధుల్లో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆప్కాస్ ఉద్యోగ, కార్మికుల రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నగర కార్యదర్శి కోట మాలాద్రి, మంగళగిరి పట్టణ కార్యదర్శి దుర్గారావు, కార్మికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment