మిర్చి రైతులకు అండగా ఉంటాం !
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నేతలు
లక్ష్మీపురం: మిర్చి రైతులకు అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నేతలు స్పష్టం చేశారు. సోమవారం గుంటూరు మిర్చి యార్డును నేతలు సందర్శించారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి. ప్రసాద్, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన రూ.11,781 మద్దతు ధరతో రైతుల ఆశలు అడియాసలయ్యాయని తెలిపారు. కనీసం రూ.20వేలు అయినా ప్రకటిస్తారని ఎదురు చూశారని పేర్కొన్నారు. తీరా గుంటూరు మార్కెట్ యార్డుకు వస్తే వ్యాపారస్తుల దోపిడీకి రైతులు బలి అవుతున్నారని చెప్పారు. మచ్చు, కమిషన్, గోతం పేరులతో క్వింటాకు వెయ్యి రూపాయల వరకు దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆసియాలోనే అతి పెద్దదైన గుంటూరు మిర్చి యార్డులో ఎన్నో రైతుల కన్నీటి గాథలు ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీ, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి. జగన్నాథం, కంజుల విఠల్ రెడ్డి, పల్నాడు జిల్లా కార్యదర్శి ఉలవలపూడి రాము, ప్రకాశం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హనుమారెడ్డి, వీరారెడ్డి, రామయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment