లింగ నిర్ధారణపై వాణిజ్య ప్రకటనలు నిషేధం
గుంటూరు మెడికల్: పీసీపీఎన్‌డీటీ చట్ట ప్రకారం జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్‌ల నిర్వాహకులు లింగ నిర్ధారణపై వాణిజ్య ప్రకటనలు ఇవ్వకూడదని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధిత చట్ట ప్రకారం ఎవరైనా వాణిజ్య ప్రకటనలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొదటిసారి తప్పునకు మూడు సంవత్సరాలు జైలు, రూ. 50వేలు జరిమానా, ఐదేళ్లపాటు ఎన్‌ఎంసీ నుంచి మెడికల్ ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి ఉండదని తెలిపారు. రెండోసారి లింగనిర్ధారణ చేస్తే ఐదేళ్ల పాటు జైలు, రూ. లక్ష జరిమానా, శాశ్వతంగా వైద్య వృత్తికి దూరమవుతారని ఆమె పేర్కొన్నారు.
సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా పరిధిలోని హెచ్‌ఎంలు, ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 10వతేదీ లోపు తెలియచేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్‌ఎంలు, ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టీఐఎస్) ద్వారా రూపొందించామన్నారు. జాబితాలు జిల్లా విద్యాశాఖ, ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కార్యాలయాలతో పాటు విద్యాశాఖ వెబ్‌సైట్, నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అభ్యంతరాలు తెలిపే ఉపాధ్యాయులు తమ పూర్తిపేరుతో కూడిన వివరాలు, జాబితాలోని తప్పిదం స్పష్టంగా పేర్కొనటంతో పాటు ఆధారాలు సమర్పించాలని సూచించారు. గడువు ముగిసిన తరువాత అందిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోమన్నారు. వచ్చిన అభ్యంతరాలపై ఫిర్యాదుల పరిష్కార కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తెలియచేస్తారని తెలిపారు. వివరాలకు జిల్లా విద్యాశాఖ, జోనల్ విద్యాశాఖ కార్యాలయాలలో సంప్రదించాలన్నారు.
బంగారం చోరీ కేసులో మరో నిందితుడి అరెస్టు
మంగళగిరి: ఆత్మకూరు అండర్ బైపాస్ వద్ద ఫిబ్రవరి 5న జరిగిన ఐదు కేజీల బంగారం కేసులో మరో నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. చోరీలో ఐదవ నిందితుడు ఖాజావలి కోర్టులో లొంగిపోయేందుకు రాగా, నిఘా ఉంచిన అధికారులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. నిందితులందరిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ అనంతరం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment