విద్యుత్‌ చార్జీల పెంపుపై ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ చార్జీల పెంపుపై ఉద్యమం

Published Thu, Mar 20 2025 2:38 AM | Last Updated on Thu, Mar 20 2025 2:36 AM

విద్య

విద్యుత్‌ చార్జీల పెంపుపై ఉద్యమం

లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్‌): ట్రూఅప్‌, సర్దుబాటు చార్జీల పేరుతో విద్యుత్‌ భారం మోపడానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజి చెప్పారు. బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలంలో విద్యుత్‌ షాకులు అనే పుస్తకాన్ని బుధవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు. ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామారావు, ఈమని అప్పారావు తదితరలు పాల్గొన్నారు.

రాజధాని రైతుల రిటర్న్‌బుల్‌ ప్లాట్లలో అత్యాధునిక సౌకర్యాలు

ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌ కె.కన్నబాబు

తాడికొండ : రాజధాని రైతుల రిటర్న్‌బుల్‌ ప్లాట్‌లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌ కె.కన్నబాబు చెప్పారు. ఎల్‌పీఎస్‌ జోన్‌లలో రైతులకు కేటాయించిన రిటర్నబుల్‌ ప్లాట్‌ల వద్ద రహదారులు, డ్రెయిన్లు, రక్షిత మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, యుటిలిటి డస్ట్‌, అవెన్యూ ప్లాంటేషన్‌, తదితర పనులు త్వరితగతిన పూర్తి చేసేలా ప్రణాళికా బద్ధంగా పనిచేస్తున్నామన్నారు. కార్యచరణలో భాగంగా రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి పరిపాలనా ఆమోదం లభించిన 22 పనులకు కమిషనర్‌ కె.కన్నబాబు విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో లెటర్‌ ఆఫ్‌ అవార్డులు(ఎల్‌ఓఏ పత్రాలు) బుధవారం అందజేశారు. ఎల్‌ఓఏ పత్రాలు అందుకున్న గుత్తేదారు సంస్థలు అమరావతిలో నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించాలని, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు అనుసరిస్తూ నిర్మాణాలు చేపట్టాలని కమిషనర్‌ సూచించారు. కార్యక్రమంలో ఈఎల్‌సీఆర్‌ గోపాలకృష్ణారెడ్డి, సీఈ ధనుంజయ, ఎన్‌.శ్రీనివాసులు, సీఆర్‌డీఏ ఇంజినీరింగ్‌ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

భార్య, ఆమె బంధువల వల్లే నా కొడుకు మరణించాడని మృతుని తల్లి ఆరోపణ

తాడేపల్లిరూరల్‌: కుటుంబ కలహాల నేపథ్యంలో ఈనెల 10న పురుగుల మందు తాగిన ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీసులు, మృతుని బంధువుల కథనం ప్రకారం.. తాడేపల్లికి చెందిన కిశోర్‌(32) మద్యానికి బానిసయ్యాడు. భార్య నాగేశ్వరితో తరచూ గొడవలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో నాగేశ్వరి తల్లి, సోదరుడు వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంలో కిశోర్‌కు, వారికి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో నాగేశ్వరి తల్లి, సోదరుడు కిశోర్‌ కళ్లల్లో కారం కొట్టి దాడి చేశారు. మనస్తాపం చెందిన కిశోర్‌ ఈనెల 10న పురుగుల మందు తాగాడు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. అయితే భార్య, అత్త, బావమరిది వల్లే తన కొడుకు మరణించాడని కిశోర్‌ తల్లి బుజ్జి ఆరోపిస్తున్నారు. పెళ్లికి ముందు కిశోర్‌కు వ్యసనాలు లేవని, ఇంటర్నెట్‌లో పనిచేసేవాడని, ఇటీవల ఆ ఉద్యోగం మానివేయడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడని బుజ్జి వివరించారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, సర్దిచెప్పాల్సిన అత్త, బావమరిది కళ్లల్లో కారం కొట్టి దాడి చేశారని, అందుకే తన కొడుకు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని, అయినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదని విమర్శించారు. బుజ్జి వాదనను నాగేశ్వరి, ఆమె బంధువులు తోసిపుచ్చారు. మద్యానికి బానిసై తనను వేధిస్తుండడంతోనే తన తల్లి, సోదరుడు వచ్చారని నాగేశ్వరి చెప్పారు. దీనిపై ఎస్‌ఐ శ్రీనివాసరావు వివరణ ఇస్తూ కేసు నమోదులో ఎలాంటి రాజీ పడలేదని, కిశోర్‌ బంధువులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు.

విద్య, ఉపాధిపై అవగాహన

గుంటూరు రూరల్‌: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సామాజిక విజ్ఞాన కళాశాలలో బుధవారం విద్యార్థులకు విద్య, ఉపాధి అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. నగర శివారుల్లోని లాంఫాంలోని కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళ, దివ్యాంగుల సంక్షేమ విభాగం ప్రభుత్వ కార్యదర్శి ఎ.సూర్యకుమారి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా శిశు అభివృద్ధి విభాగం, పోషక, విస్తరణ విభాగాలు నిర్వహించిన ప్రదర్శనను ఆమె తిలకించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. సూచనలు చేశారు. కార్యక్రమంలో సామాజిక విజ్ఞాన విభాగం డీన్‌ డాక్టర్‌ బి శ్రీలక్ష్మి, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎంఎస్‌ చైతన్యకుమారి, మహిళ శిశుసంక్షేమ శాఖ ప్రతినిధి గిరిజ పాల్గొన్నారు.

మార్చి 27 నుంచి ప్రాంతీయ వ్యవసాయ ప్రదర్శన

గుంటూరు రూరల్‌: మార్చి 27 నుంచి మూడు రోజులపాటు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ ఆర్‌ శారదజయలక్ష్మిదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రదర్శనలో దక్షిణ భారతదేశ రాష్ట్రాలనుంచి రైతులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, పాల్గొంటారని పేర్కొన్నారు.

24న ఎయిడెడ్‌ స్కూల్లో పోస్టుల భర్తీకి కంప్యూటర్‌ పరీక్ష

గుంటూరు ఎడ్యుకేషన్‌: పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్లలోని రాజీవ్‌గాంధీ మెమోరియల్‌ ఎయిడెడ్‌ విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈనెల 24న నిర్దేశిత కేంద్రాల్లో కంప్యూటర్‌ ఆధారిత టెస్టు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక బుధవారం ఓప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులకు సంబంధించిన హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే సమాచారాన్ని తదుపరి తెలియపరుస్తామని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
విద్యుత్‌ చార్జీల పెంపుపై ఉద్యమం 1
1/3

విద్యుత్‌ చార్జీల పెంపుపై ఉద్యమం

విద్యుత్‌ చార్జీల పెంపుపై ఉద్యమం 2
2/3

విద్యుత్‌ చార్జీల పెంపుపై ఉద్యమం

విద్యుత్‌ చార్జీల పెంపుపై ఉద్యమం 3
3/3

విద్యుత్‌ చార్జీల పెంపుపై ఉద్యమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement