తాడేపల్లిరూరల్ : వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే సహించేది లేదని వైఎస్సార్ సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అంకిరెడ్డి నాగ నారాయణమూర్తి హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై, మాజీ మంత్రి రోజాపై అసభ్య పోస్టులు పెట్టిన కొందరిపై గురువారం తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో నారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. అనంతరం నారాయణమూర్తి మాట్లాడుతూ పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ నేతలు ఫిర్యాదు చేస్తే క్షణాల్లో కేసులు నమోదు చేస్తున్నారని, ప్రతిపక్ష నేతలు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. అధికారపార్టీ నేతల ఒత్తిడితో ప్రతిపక్ష నేతలను పోలీసులు వేధిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటి వరకు అనేకమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ బూత్ కమిటీల రాష్ట్ర అధ్యక్షులు కొండమడుగుల సుధాకర్ రెడ్డి, అడ్వకేట్ నారాయణ రెడ్డి, ముదిగొండ ప్రకాష్, గంజి షణ్ముఖ, నరేంద్రరెడ్డి పాల్గొన్నారు.
పోలీసులు పక్షపాతం వహిస్తున్నారు ప్రతిపక్ష నేతల ఫిర్యాదులు పట్టించుకోవడం లేదు వైఎస్సార్ సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు నాగనారాయణ మూర్తి