మిర్చి యార్డులో వ్యాపారులకు లైసెన్సు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

మిర్చి యార్డులో వ్యాపారులకు లైసెన్సు తప్పనిసరి

Published Fri, Mar 21 2025 2:05 AM | Last Updated on Fri, Mar 21 2025 1:59 AM

● జీరో, కటింగ్‌ వ్యాపారం, మచ్చుకాయల దోపిడీకి అడ్డుకట్ట ● మల్టిపుల్‌ లైసెన్స్‌దారులపై చర్యలు ● ఇప్పటికే 134 మందిని గుర్తించాం ● మరో 27 మంది జాబితా తయారు చేశాం ● మరోసారి తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం ● నిర్లక్ష్య ధోరణి, అవకతవకలకు పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు ● మార్కెటింగ్‌శాఖ రాష్ట్ర కమిషనర్‌ విజయ సునీత

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డులో వ్యాపారం చేయాలంటే తప్పనిసరిగా లైసెన్స్‌ తీసుకోవాలని మార్కెటింగ్‌శాఖ రాష్ట్ర కమిషనర్‌ ఎం.విజయ సునీత స్పష్టం చేశారు. లైసెన్స్‌ లేకుండా మిర్చి వ్యాపారం చేసే వారి వల్ల ధర ప్రభావితమవుతోందని పేర్కొన్నారు. మిర్చి యార్డు ఆవరణలోని సమావేశ మందిరంలో మార్కెటింగ్‌శాఖ విజిలెన్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ రాజశేఖర్‌, రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కాకుమాను శ్రీనివాసరావుతో కలిసి యార్డు అధికారులు, సిబ్బందితో గురువారం విజయ సునీత సమీక్ష నిర్వహించారు. ఒకే కుటుంబంలో రెండు, మూడు లైసెన్స్‌లు ఎలా ఇచ్చారని అధికారులు, సిబ్బందిని వివరణ అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా యార్డులో జరిగిన, జరుగుతున్న అక్రమాలు, జీరో వ్యాపారం, కటింగ్‌ వ్యాపారం, మచ్చు కాయల దోపిడీపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్‌ విజయ సునీత మాట్లాడుతూ నిర్లక్ష్య ధోరణి గల, అవకతవకలకు పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యార్డులో జరుగుతున్న వ్యవహారాలకు అధికారులు, సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. యార్డులో లైసెన్స్‌ లేకుండా వ్యాపారం నిర్వహించే వారిపై.. వ్యాపారం చేస్తూ చేయనట్టు చూపించే వారిపై.. గత రెండు, మూడు నెలలుగా తాము అడుగుతున్న సమాచారం ఇవ్వని దిగుమతి, ఎగుమతి వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఒకే కుటుంబంలో మల్టిపుల్‌ లైసెన్స్‌లు కలిగి చట్టబద్ధంగా వ్యాపారం చేయకుండా ఐటీ ఎగ్గొట్టే ధోరణితో వ్యవహరిస్తున్న మిర్చి కమీషన్‌ ఏజంట్స్‌పై దృష్టి సారించడంతో పాటు వారి జాబితాను రూపొందించామని చెప్పారు. వాటన్నింటినీ క్రాస్‌ చెక్‌ చేసి 134 మందిని తేల్చామని పేర్కొన్నారు. దీంతోపాటు మరో 27 మంది జాబితా కూడా తయారు చేశామన్నారు. వీటన్నింటినీ మరోసారి క్రాస్‌ చెక్‌ చేసి వారిపై చర్యలు తీసుకోవడానికి జాబితా రూపొందిస్తున్నట్లు వివరించారు. యార్డులో జీరో వ్యాపారం, కటింగ్‌ వ్యాపారం, మచ్చుకాయల దోపిడీకి అడ్డుకట్ట వేసి యార్డును మరింత ప్రక్షాళన చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. యార్డులో వ్యాపారం చేసే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్‌ పొందాలని ఆదేశించారు. గుంటూరు యార్డుకు కర్ణాటక రాష్ట్రం నుంచి అధికంగా మిర్చి బస్తాలు రావడం కారణంగా లోకల్‌ ఉత్పత్తిపై ఆ ప్రభావం పడి మిర్చి ధర తగ్గే అవకాశం కనిపిస్తోందని తెలిపారు. అధికారులు, వ్యాపారులు, సిబ్బంది అందరూ కలసికట్టుగా బాధ్యతాయుతంగా వ్యవహరించి మిర్చి రైతులకు మంచి ధర కల్పించేలా చూడాలన్నారు. సమావేశంలో మార్కెటింగ్‌ శాఖ విజిలెన్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ రాజశేఖర్‌, మార్కెటింగ్‌శాఖ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కాకుమాను శ్రీనివాసరావు, సహాయ సంచాలకులు బి.రాజబాబు, మిర్చి యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక, యార్డు ఇన్‌చార్జి సుబ్రమణ్యం, అసిస్టెంట్‌ ఇన్‌చార్జి శ్రీకాంత్‌, సూపర్‌ వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement