ఫిరంగిపురం: స్థానిక శాంతిపేటలో ఓ స్థలం వివాదం నేపథ్యంలో దళితులపై దురుసుగా ప్రవర్తించిన సీఐ రవీంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం రాత్రి కాలనీ వాసులు రాస్తారోకో చేశారు. ఫలితంగా గుంటూరు –కర్నూలు రాష్ట్రరహదారిపై ఇరువైపుల రెండకిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న గుంటూరు డీఎస్పీ భానోదయ కాలనీ వాసులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. స్థానిక పోలీసు స్టేషన్‌కు మంగళవారం ఉదయం శాంతిపేట కాలనీ వాసులను డీఎస్పీ మురళీకృష్ణ పిలిపించి వారితో మాట్లాడారు. సీఐపై ఫిర్యాదు చేస్తే తగిన న్యాయం చేస్తానని చెప్పడంతో వారు జరిగిన విషయాలు తెలియజేస్తూ ఫిర్యాదు అదించారు. దీనిపై గుంటూరు ఎస్పీ సతీష్‌కుమార్ దృష్టికి తీసుకువెలతానని సీఐపై కేసు కడతానని డీఎస్పీ మురళీకృష్ణ హామీ ఇచ్చారు.
తహసీల్దార్‌కు వినతి
శాంతిపేటలో స్థలాన్ని కాలనీకి చెందిన జి.చిన్న అనే వ్యక్తి ఆక్రమించుకుని నిర్మాణం చేపడుతున్నాడని ఆ భూమి 608 ఏ–1 గ్రామకంఠానికి చెందిన భూమి అని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం తహసీల్దార్ జె.ప్రసాదరావుకు, స్థానిక పంచాయతీ ఈవో ఏకేబాబుకు కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. దీనిపై తహసీల్దార్ స్పందిస్తూ ఆ భూమి పంచాయతీ పరిధిలోకి వస్తుందని తెలిపారు. అనంతరం కాలనీవాసులు గుంటూరులోని స్థానిక ఎమ్మెల్యే కార్యాలయానికి వెల్లి తమకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేస్తామని చెప్పారు.
శాంతిపేట వాసుల రాస్తారోకో స్థలం వివాదం పరిష్కరించాలని డిమాండ్