పేదలందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలి
మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గంలోని ఇళ్లు లేని అందరికీ ఇళ్ళస్థల పట్టాలు అందజేయడంతో పాటు ఎన్నో ఏళ్లుగా కొండ పోరంబోకు, అటవీ, ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని ఉంటున్న పేదలకు అదే స్థలాల్లో పట్టాలివ్వాలని, లేకుంటే ప్రజలను సమీకరించి ఉద్యమం తీవ్రతరం చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు హెచ్చరించారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రలో వచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ మంగళవారం మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ నియోజకవర్గంలో 23వేల మంది పేదలు ఇంటి స్థలాల కోసం ఎదురు చూస్తుంటే మంత్రి నారా లోకేష్ ఐదు వేల మందికి పట్టాలిస్తామనడం సరికాదన్నారు. 23 వేల మంది స్థలాల పట్టాలివ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించాలన్నారు. మంగళగిరి పట్టణంలోని 134 సర్వేలోని ప్రభుత్వ భూమిని పేదలకు ఇవ్వాలని కోరారు .నగరంలోని అనేక కాలనీలలో డ్రెయినేజీ, తాగునీటి సమస్య ఉందని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పేరుతో చేనేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు ఇచ్చిందని, అలాగే టీడీపీ ప్రభుత్వం కార్మికులకు పథకం వర్తింపజేసి ఏడాదికి రూ రూ.24 వేలు ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వీసం జవహర్‌లాల్, జేవి రాఘవులు, పిల్లలమర్రి బాలకృష్ణ, ఎస్‌ఎస్ చెంగయ్య తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం కార్యదర్శి పాశం రామారావు