
28, 29 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు
గుంటూరు ఎడ్యుకేషన్: సెయింట్ జోసఫ్ మహిళా బీఈడీ కళాశాలలో ఈనెల 28, 29 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.స్వరూపరాణి తెలిపారు. సాంబశివపేటలోని కళాశాలలో బుధవారం సదస్సు బ్రోచర్, ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా స్వరూపరాణి మాట్లాడుతూ గ్లోబల్ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ (జీసీపీఏ), సెయింట్ జోసఫ్ మహిళా బీఈడీ కళాశాల సంయుక్తంగా తొలిసారిగా అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘సైకో సోషల్ కాంపెటెన్సీస్ ఫర్ గ్లోబల్ యూత్’’ అనే అంశంపై ఏర్పాటు చేస్తున్న సదస్సు ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.మధుమూర్తి, ఏఎన్‌యూ వీసీ ఆచార్య కె.గంగాధరరావు, గుంటూరు జేఎంజే ప్రొవిన్షియల్ సుపీరియర్ సిస్టర్ విజయమేరీ ఉడుముల, పలువురు ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొంటుండగా, ఎస్వీయూ పూర్వ వీసీ ఆచార్య వి.శ్రీకాంత్‌రెడ్డి ముఖ్య ప్రసంగం చేస్తారని వివరించారు. దేశ, విదేశాల నుంచి పరిశోధకులు, అధ్యాపకులు, వివిధ రంగాల ప్రముఖులు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా సదస్సుకు హాజరు కానున్నారని చెప్పారు. జీసీపీఏ అధ్యక్షురాలు డాక్టర్ డి. సరోజ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో సామాజిక, మానసిక పరిస్థితులకు అనుగుణంగా యువతను సక్రమమైన మార్గంలో పయనింపచేయడంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు సదస్సు దోహదం చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ ఏ. రోజిలీన్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. శ్రీలత, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టీఎస్ సుభాషిణి పాల్గొన్నారు.