చినగంజాం: రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. చినగంజాం మండలం కొత్త గొల్లపాలెం గ్రామానికి ఏప్రిల్ 1వ తేదీన సీఎం చంద్రబాబునాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో గ్రామంలో ఆదివారం కలెక్టర్, ఎస్పీ తుషార్ డూడీలు పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులకు కేటాయించిన బాధ్యతలను సోమవారం సాయంత్రంలోగా పూర్తి చేయాలన్నారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. ప్రజావేదిక వద్ద 2 వేల మంది ప్రజలు హాజరయ్యే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా మంచినీటిని సరఫరా చేయాలన్నారు. ఆయనవెంట జేసీ ప్రఖర్ జైన్, డీఆర్‌ఓ ప్రభాకర్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, డ్వామా పీడీ విజయలక్ష్మి, జిల్లా రవాణాశాఖాధికారి పరంధామరెడ్డి, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి మాధవ నాయుడు తదితరులు ఉన్నారు.