
మద్యం మత్తులో ఆటోలను ఢీకొట్టిన కారు
● రెండు ఆటోల్లో 17మందిపైనే ప్రయాణికులు ● ఎనిమిది మందికి గాయాలు
చినగంజాం: మద్యం మత్తులో కారు నడుపుతూ ఎదురుగా వస్తున్న కూలీల ఆటోలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి పైనే గాయాల పాలైన ఘటన సోమవారం సాయంత్రం చినగంజాం రొంపేరు బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. చినగంజాం పల్లెపాలెం, చీరాల బోయనవారిపాలెం గ్రామానికి చెందిన పలువురు మహిళా కూలీలు నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో కూలీ పనుల కోసం వచ్చి సోమవారం సాయంత్రం పనులు ముగించుకొని ఆటోలలో ఇంటికి తిరిగి వెళ్తున్నారు. వారి ఆటోలు రొంపేరు బ్రిడ్జి సమీపానికి వచ్చేసరికి చీరాల నుంచి వస్తున్న ఏపీ 31 బీకే 1881 నంబరుతో ఉన్న కారులో డ్రైవర్ ఫూటుగా మద్యం సేవించి ఎదురుగా వస్తున్న కూలీల ఆటోను ఢీ కొట్టాడు. ముందు వెళ్తున్న బోయనవారిపాలెం ఆటోను బలంగా ఢీ కొట్టడంతో వెనుక ఉన్న ఆటో దానిని ఢీ కొట్టింది. వెనుక ఉన్న ఆటోలో మహిళా కూలీలకు స్వల్ప గాయాలు కాగా ముందు ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒక వృద్ధురాలికి తీవ్ర రక్తస్రావం అయ్యింది. కారు, ఆటో డ్రైవర్‌లు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వైద్య చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. గాయాలపాలైన మహిళా కూలీలను చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న బీహార్‌కు చెందిన శంశాద్ పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు తరలించినట్లు తెలిపారు. ఆటోలో ప్రయాణిస్తున్న కొండేపి శివజ్యోతి కాలు విరిగినట్లు చీరాల ఔట్ పోస్టు ఏఎస్‌ఐ శ్యాం తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఆయన వివరించారు.

మద్యం మత్తులో ఆటోలను ఢీకొట్టిన కారు