తాడేపల్లి రూరల్: విజిబుల్ పోలీసింగ్‌తో ప్రజలకు దగ్గరగా ఉన్నప్పుడు పోలీస్‌శాఖపై నమ్మకం పెరుగుతుందని గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ రవికుమార్ చెప్పారు. తాడేపల్లి రూరల్‌పరిధిలోని నులకపేటలో మంగళవారం రాత్రి విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకంగా న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు. తాడేపల్లి సీఐ కల్యాణ్‌రాజు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పౌరసరఫరాల గోదాము పరిశీలన
తాడికొండ: తాడికొండ సివిల్ సప్‌లైస్ గోదాములో జరుగుతున్న గోల్‌మాల్ వ్యవహారంపై ఎట్టకేలకు సివిల్ సప్‌లైస్ అధికారులు స్పందించారు. ‘రేషన్ బియ్యం సరఫరాలో గోల్‌మాల్’ శీర్షికన మంగళవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి డీఎస్‌ఓ పద్మ స్పందించారు. గోదామును తనిఖీ చేశారు. సరుకు వివరాలు, రిజిస్టర్‌ను పరిశీలించారు. డీలర్లకు తక్కువగా సరుకు వెళుతున్న విషయంపై హమాలీలు, గోదాము ఇన్‌చార్జిని ప్రశ్నించారు. వారు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన డీఎస్‌ఓ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అధికార పార్టీకి చెందిన డీలర్ ఎవరు? అతనికి సరుకు వెళుతుందా అని ప్రశ్నించగా సరైన సమాధానం రాలేదు. దీంతో ఆమె లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని డీలర్లను కోరారు. ప్రతి బస్తాకు తమకు 600 గ్రాముల నుంచి కిలో వరకు తక్కువగా వస్తుందని, తూకం వేయకుండానే నేరుగా లోడింగ్ చేస్తున్నారని లిఖిత పూర్వకంగా డీలర్లు ఫిర్యాదు ఇచ్చారు.
సదరం ధ్రువపత్రాలు కోసం 4 నుంచి శ్లాట్ బుకింగ్
తాడికొండ: దివ్యాంగులకు ప్రభుత్వం పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన సదరం క్యాంపుల కోసం స్లాట్ బుకింగ్‌లు ఈనెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తాడికొండ, తుళ్ళూరు ఎంపీడీవోలు కె.సమతావాణి, కానూరి శిల్ప ఒక ప్రకటనలో తెలిపారు. 4న ఉదయం 10 గంటల నుంచి గ్రామ/వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో సదరు నమోదు చేయించుకోవాలని వారు సూచించారు.
అరండల్‌పేటలో యువకుడి హత్య!
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్):అరండల్‌పేట 1వ లైన్‌లో నలుగురి మధ్య జరిగిన ఘర్షణ ఓ వ్యక్తి మరణానికి దారి తీసింది. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. అరండల్‌పేట పోలీసుల కథనం ప్రకారం.. వెంకటప్పయ్య కాలనీకి చెందిన గణేష్ (35)కి అరండల్‌పేటలో భిక్షాటన చేస్తూ మద్యం, గంజాయి తాగే మరో ముగ్గురితో స్నేహం కుదిరింది. ఈ నేపథ్యంలో ఒక స్నేహితుడి సోదరి పట్ల గణేష్ అసభ్యంగా ప్రవర్తించడంతో ముగ్గురూ కలిసి గణేష్‌పై దాడి చేశారు.
ఈ ఘటన సాయంత్రం నాలుగు గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న గణేష్‌ను తీవ్రంగా కొట్టడంతో వారి వద్ద నుంచి పారిపోయి దాక్కున్నాడు. అయితే గొంతు ఎండిపోయి అక్కడికక్కడే మరణించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్ధానికులు అరండల్‌పేట పోలీసులకు రాత్రి 11గంటలకు సమాచారం అందించడంతో వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్, సీఐ వీరాస్వామి, సిబ్బందితో చేరుకుని మృతుడి వివరాలను సేకరించారు. మృతదేహాన్ని ప్రభుత్వ సమగ్రాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడికి నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో సస్పెక్ట్ రౌడీషీట్ ఉన్నట్లు సమాచారం.

విజిబుల్ పోలీసింగ్‌తోనే ప్రజల్లో విశ్వాసం

పౌరసరఫరాల గోదాము పరిశీలన