
శంకర్ విలాస్ ఆర్వోబీని కుదించటం సరికాదు
గుంటూరు ఎడ్యుకేషన్: రాబోవు 50 ఏళ్లలో నగర ప్రజల భవిష్యత్ ప్రజల అవసరాలు, బహుళ ప్రయోజనాలను నెరవేర్చేలా శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని, చాలీచాలని నిధులతో తక్కువ నిడివితో నిర్మిస్తే ప్రయోజనం ఉండదని శంకర్ విలాస్ ఫైఓవర్ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. బుధవారం అరండల్‌పేటలోని ఓ హోటల్లో సమావేశమైన జేఏసీ నాయకులు శంకర్‌విలాస్ ఆర్వోబీ నిర్మాణం, భవిష్యత్తు అవసరాలపై మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావుతో కలిసి కలెక్టరేట్‌కు వెళ్లి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి వినతిపత్రం అందచేశారు. ఈసందర్భంగా డిజైన్‌లో చేయాల్సిన మార్పులపై పౌర సంఘాల అభిప్రాయాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు ఎల్‌ఎస్ భారవి మాట్లాడుతూ ఆర్వోబీకి తాము వ్యతిరేకం కాదని, అది భవిష్యత్‌కు ఉపయోగపడే విధంగా ఉండాలన్నదే తమ అభిప్రాయం అని స్పష్టం చేశారు. గతంలో ప్రకటించిన ప్లాన్‌కు భిన్నంగా, ప్రజల ఆమోదం లేని కొత్త ప్లాన్‌తో అధికార యంత్రాంగం ముందుకు వెళ్లటం సరికాదన్నారు. గతంలో హిందూ కాలేజి సెంటర్ నుంచి లాడ్జి సెంటర్ వరకూ నిర్మిస్తామని, ఆర్వోబీ, ఆర్‌యూబీ రెండింటినీ నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఇప్పుడు ప్లాన్‌ను పూర్తిగా మార్చేశారన్నారు. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు రోజువారీ రాకపోకలు సాగించే ప్రజలకు శంకర్ విలాస్ బ్రిడ్జి ప్రధాన మార్గమన్నారు. అటువంటి ఆర్వోబీని మూసివేస్తే, మూడు వంతెనలు, ఇతర మార్గాలు ప్రజలు అవసరాలు తీర్చలేదన్నారు. ముందుగా ఆర్‌యూబీ నిర్మించి, తర్వాత ఆర్వోబీ నిర్మించాలన్నారు. ప్రస్తుత ట్రాఫిక్ అవసరాల రీత్యా ఆరు లైన్ల నిర్మాణం అవసరం అని చెప్పిన కలెక్టర్, అధికార యంత్రాంగం నాలుగు లైన్లకు తగ్గించటమే కాకుండా, ఆర్‌యూబీ లేకుండా ట్రాఫిక్ అవసరాలు ఎలా తీరుతాయో ప్రజలకు చెప్పాలని కోరారు. జేఏసీ నాయకుడు పీవీ మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయని, పౌర సంఘాలతో చర్చిస్తే స్పష్టత వస్తుందన్నారు. అధికార యంత్రాంగం డీపీఆర్ ఆమోదానికి ముందు ప్రజలతో ఎలాంటి చర్చా జరపలేదన్నారు. అలాగే సామాజిక ప్రభావం సర్వే సైతం నిర్వహించలేదన్నారు. 23 అడుగుల సర్వీసు రోడ్డులో ఐదు అడుగులు డ్రైన్‌కు పోతే మిగిలిన రోడ్డులో ట్రాఫిక్ సులభంగా ఎలా వెళుతుందని ప్రశ్నించారు. ఆర్‌యూబీ లేకపోతే తూర్పు, పశ్చిమ నియోజకవర్గ ప్రజలు జీజీహెచ్, విద్యాసంస్థలు, హాస్పిటల్స్, ఇతర వాణిజ్య అవసరాల కోసం రాకపోకలు సాగించటం సాధ్యం కాదన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, చరిత్రలో చెప్పుకునే విధంగా ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని, అవసరం అయితే అందుకు అదనపు నిధులు సాధన కోసం కృషి చేయాలని కోరారు. సమావేశంలో జేఏసీ నాయకులు అవధానుల హరి, ఎన్.కమలకాంత్, రాధాకృష్ణ, వి.సదాశివరావు, వెంకట్రావు, కె.నళినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు నిధులు సమకూర్చి పాత ప్లాన్ ప్రకారం నిర్మించాలి
కలెక్టర్‌కు జేఏసీ ప్రతినిధుల వినతి