
మిర్చి ఘాటు చూపిస్తాం
కొరిటెపాడు(గుంటూరు): మిర్చి రైతులను ఆదుకోవాలని కోరుతూ గుంటూరు మిర్చి యార్డులో ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకృష్ణ, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కంచుమాటి అజయ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన క్వింటా మిర్చి ధర రూ.11,781లు మోసపూరితంగా ఉందని ధ్వజమెత్తారు. రైతులు క్వింటా మిర్చి పండించడానికి రూ.25 వేలు నుంచి రూ.30 వేలకు పైగా ఖర్చు అవుతుండగా, దీనిలో సగం మద్దతు ధర కల్పించడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండతోనే కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతుల నుంచి మిర్చిని నేరుగా కొనుగోలు చేస్తే రైతులు, కౌలు రైతులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. 2019 నుంచి 2023 వరకు క్వింటా మిర్చి రూ.18 వేలు నుంచి రూ.27 వేల వరకు ధర వచ్చిందని గుర్తుచేశారు. ఈ ఏడాది కేవలం రూ.7 వేలు నుంచి రూ.13 వేలు లోపు ధర పలికిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవే ధరలు కొనసాగితే రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ధరల స్థిరీకరణ కింద కేవలం రూ.300 కోట్లు కేటాయించడం చూస్తే రైతులంటే కూటమి ప్రభుత్వానికి లెక్కలేదని స్పష్టమవుతోందని విమర్శించారు. ధరల స్థిరీకరణ నిధి కింద రూ.ఐదువేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ముందుగా నరసరావుపేట రోడ్ వైపు ప్రధాన గేటు నుంచి నినాదాలు చేస్తూ మిర్చి యార్డు కార్యదర్శి చాంబర్ వరకు రైతులు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం యార్డు కార్యదర్శి ఎ.చంద్రికకు వినతిపత్రం అందజేశారు. స్పందించిన యార్డు కార్యదర్శి చంద్రిక మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఇప్పటివరకు ఎలాంటి విధి విధానాలు రాలేదని చెప్పారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి రైతులను ఆదుకోకపోతే త్వరలో మిర్చి యార్డును ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ రైతు, కౌలు రైతు సంఘాల గుంటూరు, పల్నాడు జిల్లాల నాయకులు బైరగాని శ్రీనివాసరావు, కె.రామారావు, జి.బాలకృష్ణ, బి.రామకృష్ణ, బిక్కి శ్రీనివాస్, జి.పిచ్చారావు, ఈవూరి అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆదుకోకుంటే త్వరలో
యార్డు ముట్టడి
ఏపీ రైతు, కౌలు రైతు
సంఘాల హెచ్చరిక