
రాజధానిలో ఇదే నిజం
ఇంటి ఇంటికో న్యాయం..
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాజధాని అమరావతి గ్రామాలలో ఇంటి ఇంటికో న్యాయం అన్నట్లు వ్యవహారాలు సాగుతున్నాయి. పాలకులు, ఉన్నతాధికారుల ఇష్టాయిష్టాలే నిర్ణయాలవుతున్నాయి. వాటినే న్యాయమైనవిగా చిత్రీకరించే యత్నాలు జరుగుతున్నాయి. గ్రామకంఠాల హద్దుల నిర్ణ యాలు, ప్రత్యామ్నాయంగా మినహాయించే భూమి విషయంలో తీవ్ర అన్యాయాలు చోటుచేసుకున్నాయనేది బహిరంగ రహస్యమే. దీనిపై ఏపీ సీఆర్‌డీఏ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లిన ప్రతిసారీ పలు గ్రామాల వారికి అన్యాయం జరిగిన మాట వాస్తవమే అయితే తమ చేతుల్లో ఏమీ లేదని చేతులెత్తేస్తున్నారని యజమానులు వాపోతున్నారు. గ్రామకంఠాల విషయంలో తమకు అన్యాయం జరిగిందని అప్పటి, ఇప్పటి పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ వద్ద ఎంతగా మొత్తుకుంటున్నా దాటవేత మాటలే తప్ప స్పష్టత రావడం లేదనే తీవ్ర ఆరోపణలు గ్రామస్తుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. అన్యాయాలను సరిచేస్తారనే నమ్మకం సడలుతున్నందున న్యాయస్థానాన్ని ఆశ్రయించడం మినహా గత్యంతరం లేదని రాజధాని గ్రామాల్లోని రైతులు హెచ్చరిస్తున్నారు.
భవిష్యత్తు అవసరాల కోసమంటూ...
అమరావతి రాజధాని కోసం భూ సమీకరణ పథకం (ల్యాండ్ పూలింగ్ స్కీం–ఎల్‌పీఎస్) కింద తాడేపల్లి, ఉండవల్లితోపాటు 29 గ్రామాల పరిధిలో భూములను తీసుకునే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు విభిన్న హామీలను కుమ్మరించింది. గ్రామాలను యథాతథంగా ఉంచుతామని, గ్రామకంఠాలను స్పష్టంగా నిర్దేశిస్తామని, భవిష్యత్తు అవసరాలకు గ్రామ శివార్ల నుంచి కొంత భూమి యజమానులకు మినహాయింపుగా ఇస్తామని నమ్మబలికింది. రాజధాని ప్రకటన నోటిఫికేషన్ నాటికి ఉన్నది ఉన్నట్లేనని వెల్లడించింది. అయితే ఆ తరువాత పలుకుబడి కలిగిన వారికి ఓ న్యాయం, పేదలకు మరో న్యాయం అన్నట్లు వ్యవహారాలు జరిగాయి. ప్రభుత్వం నుంచి అనుచిత లబ్ధి పొందడానికి కొత్త నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వానికి అనుకూలురుగా ఉన్న వారి నూతన భవనాలు, షెడ్లను పరిగణలోకి తీసుకోగా, పేదలవి తిరస్కరణకు గురైన ఉదాహరణలు ఉన్నాయి. 2014–2019 మధ్య కాలంలో ఇలాంటివి చాలానే చోటుచేసుకున్నాయి.
ఒక్కో గ్రామంలో ఒక్కోలా...
గ్రామకంఠం పరిధిలో నిర్మాణాలున్న యజమానులకు భవిష్యత్తు అవసరాల కోసం, ఖాళీ స్థలాల ఆధారంగా గ్రామ శివారును సరిహద్దుగా నిర్ణయించి, అక్కడి నుంచి 500 మీటర్లు పూర్తిగా వదిలేస్తామని మంత్రి నారాయణ ఊరూరా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇల్లు, పశువుల కొష్టం, గడ్డి వామి, బ్యారన్ తదితర నిర్మాణాల ప్రహరీలను గుర్తించి వాటిని హద్దుగా నిర్ణయిస్తామని ప్రభుత్వం చెప్పింది. అలాంటి యజమానులు స్థలాల కోసం దరఖాస్తు చేసుకుంటే పది సెంట్ల వరకు మినహాయింపుగా ఇస్తామని కూడా వివరించింది. ఇందుకు పంచాయతీరాజ్ చట్టాన్నీ ఉదహరించింది. కాగా కొన్ని గ్రామాల్లో పై హామీ విషయంలో అధికారులు ఉదారంగా వ్యవహరించగా మరికొన్ని చోట్ల అమలు చేయలేదు. దరఖాస్తుదారుల్లో పలువురికి పది సెంట్లు మాత్రమే మినహాయించగా, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన వారికి, పలుకుబడి కలిగిన వారికి, అధికారులకు లంచాలు ముట్టచెప్పిన వారికి ఇష్టానుసారం భూమిని మినహాయించిన దాఖలాలు ఉన్నాయి. ఇంటి, ఇంటికీ, గ్రామ గ్రామానికీ మధ్య ఉన్న వ్యత్యాసాలను ఉటంకిస్తూ తమకూ తగిన న్యాయం చేయాలని 9.2 ద్వారా ఏపీ సీఆర్‌డీఏకి విభిన్న గ్రామాల వారు అర్జీలు అందజేస్తూ వచ్చారు. దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని ఇప్పటికీ అధికారికంగా ఏపీ సీఆర్‌డీఏ నిర్వహిస్తున్న సభలు, సమావేశాల్లో డిమాండ్ చేస్తున్నారు. గతంలో తమకు ఇచ్చిన హామీని మంత్రి నారాయణకు గుర్తు చేస్తున్నారు. తుళ్లూరు, విజయవాడల్లోని కార్యాలయాలకు వెళ్లి విన్నవిస్తున్నారు.
ఈ ఫొటోలోని ఇళ్లు నెక్కల్లులోని ముగ్గురు సోదరులవి. వీరి నివాసాలు శివారులో ఉన్నా గ్రామకంఠం పరిధిలోకి చేర్చలేదు. భూమి మినహాయింపు ఇవ్వలేదు. తమకు జరిగిన అన్యాయంపై దరఖాస్తు చేసుకున్నా, ఎన్నిసార్లు అధికారులను కలిసినా ఇప్పటికీ ఫలితం లేదు.
గ్రామకంఠం హద్దుల అంశంలో దారుణాలు
ఒక్కో గ్రామంలో ఒక్కో విధంగా నిర్ణయాలు
యజమానిని బట్టి భూమి మినహాయింపులు
పేదోళ్లకు ఒకలా.. పెద్దోళ్లకు మరోలా అవకాశాలు
అమరావతిలో అంతులేని అక్రమాలు
మంత్రి నారాయణ హామీలకు మోసపోయామంటున్న బాధితులు
న్యాయం జరగకపోతే కోర్టుకే అంటున్న యజమానులు
ఈ ఫొటోలో కనిపిస్తున్న భూమి తుళ్లూరు దామినేని కృష్ణవేణికి చెందినది. రోడ్డు నిర్మాణం కోసం 1.28 ఎకరాలు అవసరమైంది. ఇక్కడ రెండు బ్యారన్లు, రెండు షెడ్లు ఉన్నాయంటూ 1.28 ఎకరాలకు సమానమైన భూమిని ఇవ్వడంతో పాటు పరిహారంగా 6,193.83 చదరపు గజాల ప్లాట్‌ను ప్రత్యేకంగా కేటాయించారు. కష్ణవేణి భర్త దామినేని శ్రీనివాసరావు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌కు ప్రధాన అనుచరుడు, తుళ్లూరు మండల స్థాయి టీడీపీ నాయకుడు కావడమే ఇందుకు కారణం.
నెక్కల్లు గ్రామ సర్వేనెంబరు 143/3లో మిక్చర్ కాలనీ(విభిన్న సామాజిక వర్గాల వారు కలిసి ఉంటారు.)లోని వారికి తీవ్ర అన్యాయం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. కాలనీలో చుట్టుపక్కల ఇళ్లు ఉన్నా పరిఽగణలోకి తీసుకోలేదు. న్యాయం చేయాలని కోరుతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు.

రాజధానిలో ఇదే నిజం

రాజధానిలో ఇదే నిజం