
12 నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్
తెనాలి: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్, జాతీయస్థాయి చతుర్ధ ఆహ్వాన సాంఘిక నాటికల పోటీలను ఈనెల 12వ తేదీనుంచి 18వ తేదీవరకు నిర్వహించనున్నారు. పట్టణ రామలింగేశ్వరపేట లోని ఓపెన్ ఆడిటోరియం (తడికలబడి)లో జరగనున్న ఈ పోటీల బ్రోచర్‌ను బుధవారం స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతులమీదుగా ఆవిష్కరించారు. వివరాలను పరిషత్ నిర్వాహకులు, తెనాలి కళాకారుల సంఘం గౌరవాధ్యక్షుడు ఆరాధ్యుల కన్న, అధ్యక్షుడు అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి, కార్యదర్శి పిట్టు వెంకట కోటేశ్వరరావు, కోశాధికారి సుబ్రహ్మణ్యం తెలియజేశారు. ఏడురోజులు జరిగే నాటికల పోటీల్లో 11 నాటికలను ప్రదర్శిస్తారు. తొలిరోజున జరిగే ప్రారంభసభలో రజక సంఘం నేత పెసర్లంక రమణకు వైఎస్ రాజశేఖరరెడ్డి పురస్కారం ప్రదానం చేస్తారు. 16న తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా కందుకూరి వీరేశలింగం పురస్కారాన్ని భీమవరానికి చెందిన చైతన్య కళాభారతి సంగీత నృత్యనాటక కళాపరిషత్ నిర్వాహకుడు రాయప్రోలు భగవాన్‌కు బహూకరిస్తారు. 18న జరిగే ముగింపుసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అత్తోట కిషోర్‌కుమార్ (చంటి)కు రాజశేఖరరెడ్డి స్మారక పురస్కారాన్ని అందజేస్తామని వివరించారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షతన జరిగే ఆయా సభల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రులు పాల్గొంటారని వివరించారు. బ్రోచర్ ఆవిష్కరణలో పార్టీ నేతలు అక్కిదాసు కిరణ్‌కుమార్, కఠారి హరీష్, షేక్ దుబాయ్‌బాబు, అత్తోట సర్పంచ్ నాగపుణ్యేశ్వరరావు పాల్గొన్నారు.
జాతీయస్థాయి చతుర్ధ ఆహ్వాన సాంఘిక నాటికల పోటీలు
ఏడురోజుల పాటు 11 నాటికల ప్రదర్శన
మూడు సభల్లో ప్రముఖులకు పురస్కారాల ప్రదానం