
అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
పట్నంబజారు: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బందితో పలు ప్రాంతాల్లో ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. సంగడిగుంట, పొన్నూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లు, విద్యుత్ తీగల వల్ల జరిగే అగ్ని ప్రమాదాలపై మాక్‌డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం ప్రచార వాల్‌పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేశారు. గుంటూరు–2 ఫైర్ స్టేషన్ అధికారి పి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
కేరళకు తరలిస్తున్న
గోవులు పట్టివేత
మంగళగిరి: నగర పరిధిలోని కాజ టోల్‌గేట్ వద్ద 30 గోవులను పట్టుకున్నారు. శ్రీకాకుళం నుంచి కేరళకు గోవులను తరలిస్తున్నారనే సమాచారం మేరకు బుధవారం వీహెచ్‌పీ నేతలు టోల్‌గేట్ వద్ద కాపలా వుండి 30 గోవులను తరలిస్తున్న కంటైనర్‌ను, డ్రైవర్ అన్సారీని పట్టుకుని మంగళగిరి రూరల్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు గోవులను గో ఆశ్రమానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
సబ్ జైలులో
జిల్లా జడ్జి పరిశీలన
రేపల్లె రూరల్: రేపల్లె సబ్ జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సయ్యద్ జియావుద్దీన్ బుధవారం సందర్శించారు. జైలు పరిసరాలను, ఖైదీల గదులను, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడారు. నేరం ఆరోపించబడి ప్రైవేటు న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని వారి కోసం ప్రభుత్వం ఉచిత న్యాయ సేవలు అందించేందుకు ప్రభు త్వ న్యాయవాదిని ఏర్పాటు చేసిందన్నారు. అవసరమైన వారు ప్రభుత్వ న్యాయవాది సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. కార్య క్రమంలో ప్యానెల్ న్యాయవాది గుమ్మడి కుమార్‌బాబు, సబ్ జైల్ సూపరింటెండెంట్ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అకాల వర్షంతో
దెబ్బతిన్న పంటలు
యద్దనపూడి: మండలంలోని పూనూరు, చింతగుంటపాలెం, గన్నవరం గ్రామాల్లో బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి ఆరుగాలం శ్రమించి పండించిన పంట కల్లాల్లో తడిసి ముద్ద కావటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే అకాల వర్షంతో మరింత నష్టం చేకూరిందని వాపోతున్నారు. సుమారు 2 గంటలపాటు ఎడతెరిపి లేకుండా కుంభవృష్టిగా వర్షం పడటంతో కల్లాల్లో ఆరబోసిన మిర్చి, మొక్కజొన్న, పందిళ్లపై ఉన్న పొగాకు పంటలు పూర్తిగా తడిసిపోయాయి. తద్వారా పంటకు బూజు, ఫంగస్ పట్టి పంట నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైభవంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
పిడుగురాళ్ల : పట్టణంలోని శ్రీ రామ తీర్థ సేవాశ్రమం బజార్‌లోని శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఇటీవల ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. బుధవారం గాయత్రి పీఠం ప్రధాన అర్చకులు విష్ణువర్ధన్ శర్మ శాస్రోక్తంగా పూజలు నిర్వహించి మేధా దక్షిణామూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించారు. అనంతరం కందుల శ్రీనివాసరావు తండ్రి జ్ఞాపకార్థం రూ. 17 లక్షలను ఆలయ పునర్నిర్మాణానికి అందించారు. వేలమంది భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన