
మనోళ్లే ఆర్పీగా పెట్టుకోండి
● ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ● నియమించిన మెప్మా సిబ్బంది
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): ‘మనోళ్లే.. నేను చెప్తున్న కదా.. ఆ అమ్మాయిని రిసోర్స్ పర్సన్(ఆర్పీ)గా పెట్టుకోవాలి’ అంటూ తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఇవ్వడంతో మెప్మా సీఎంఎం పావని, సీఓ సరోజిని కొత్తగా ఓ ఆర్పీని నియమించారు. అంతేగాక వేరే ఆర్పీల వద్ద నుంచి 22 గ్రూపులను తీసుకుని ఆమెకు కేటాయించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఎంలు(సిటీ మిషన్ మేనేజర్), సీఓలు(కమ్యూనిటీ ఆర్గనైజర్)ల కంటే ఆర్పీలు ఎక్కువగా ఉన్నారని.. వీరికి జీతాలు చెల్లించేందుకూ అవస్థలు పడాల్సిన దుస్థితి ఉందని, కొత్తవారిని తీసుకోవద్దని మెప్మా ఎండీ స్పష్టంగా ఆదేశించినా సిబ్బంది పెడచెవిన పెట్టారు. ఎమ్మెల్యే లేటర్ ఇచ్చారని కొత్త ఆర్పీని నియమించారు. బుధవారం రామిరెడ్డితోటలోని బంగ్లా మున్సిపల్ స్కూల్‌లో సమావేశమై కొత్త ఆర్పీని గ్రూపు సభ్యులకు పరిచయం చేశారు.
లాగిన్ ఇవ్వడం లేదు
కొత్త ఆర్పీ కోసం సమైక్యలో గ్రూపు సభ్యులంతా కలిసి తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానం మేరకే కొత్త ఆర్పీని నియమించాం. కానీ లాగిన్ ఇవ్వడం లేదు. ప్రస్తుతం వేరే ఆర్పీల వద్ద ఉన్న గ్రూపుల నుంచి 22 గ్రూపులను కొత్త ఆర్పీకి కేటాయించాం.
– పావని, సీఎంఎం
గుంటూరు–ఔరంగాబాద్ రైలు 90 నిమిషాలు ఆలస్యం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట): దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ మీదుగా ప్రయాణించాల్సిన గుంటూరు–ఔరంగబాద్ రైలు ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో 90 నిమిషాలపాటు ఆలస్యంగా ప్రయాణిస్తుందని డివిజన్ సీనియర్ డిసీఎం ప్రదీప్‌కుమార్ బుధవారం తెలిపారు. రైలు నంబర్ 17253 రైలు గుంటూరు–ఔరంగబాద్ రైలు ఈనెల 11, 12, 13వ తేదిలలో 90 నిమిషాలపాటు ఆలస్యంగా ప్రయాణిస్తుందని ప్రయాణికులు గమనించి సహకరించాల్సిందిగా కోరారు.
పీహెచ్‌సీలలో డీఎంహెచ్‌ఓ తనిఖీలు
అచ్చంపేట(క్రోసూరు): పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి.రవి అచ్చంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. మాదిపాడు పీహెచ్‌సీ పరిధిలోని చింతపల్లి, మాదిపాడు సబ్ సెంటర్స్‌లో జరిగే సాధారణ ఇమ్యూనైజేషన్ కార్యక్రమాన్ని తనిఖీ చేసారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందికి డీఎంహెచ్‌ఓ పలు సూచనలు చేశారు. చిన్న పిల్లల వాక్సినేషన్‌ను వేసవి దృష్ట్యా ఉదయం 11 గంటల లోపు ముగించాలని తెలిపారు. అనంతరం పీహెచ్‌సీ కార్యకలాపాలపై వైద్యాధికారి డాక్టర్ ఎం.ఇన్నారావును అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో జిల్లా ప్రోగ్రామ్ నోడల్ అధికారి డాక్టర్ డి.హనుమకుమార్ పాల్గొన్నారు. అచ్చంపేట పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ సీహెచ్ స్రవంతి, మాదిపాడు సీహెచ్‌ఓ హర్ష వర్ధన్, శివ నాగేశ్వరి, ఆరోగ్య విస్తరణ అధికారి పి.వెంకటరావు, హెల్త్ ఎడ్యుకేటర్ పార్వతి, సూపర్‌వైజర్ పి.రాధాకృష్ణ, సిబ్బంది ఉన్నారు.

మనోళ్లే ఆర్పీగా పెట్టుకోండి