
రాసి రంపానబెట్టు..!
● పోలీస్ స్టేషన్లలో రైటర్లదే హవా! ● ఏ ఫిర్యాదు అయినా రాత్రి 10.30 తర్వాతే కేసు ● స్టేషన్ బయట బాధితులు పడిగాపులు కాయాల్సిందే
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): న్యాయం కోసం పోలీస్ స్టేషన్లకు వస్తున్న బాధితులకు నరకం కనిపిస్తోంది. ఫిర్యాదుపై కేసు నమోదుకు గంటల తరబడి పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. కేసు నమోదుకు స్టేషన్ రైటర్లు, సిబ్బంది తాత్సారం చేస్తున్నారు. రోజూ రాత్రి 10.30 గంటల తర్వాత రాజీ కుదరకపోతేనే కేసు నమోదు చేస్తున్న దుస్థితి నెలకొంది. దీనివల్ల బాధితులు ఇబ్బంది పడుతున్నారు. గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని పట్టాభిపురం, అరండల్‌పేట, నగరంపాలెం పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్లు రోజూ అర్ధరాత్రివరకు జనంతో రద్దీగా ఉంటాయి. ప్రతి స్టేషన్‌లోనూ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓలు, ఎస్‌ఐల కంటే రైటర్‌లదే హవా. ఏ కేసైనా వారికి తెలీకుండా నమోదవదు. ఈ కేసులన్నీ రాత్రి 10.30 గంటల తర్వాతే నమోదవుతాయి. వాస్తవానికి స్పెషల్ బ్రాంచి సిబ్బంది రోజూ రాత్రి 9 గంటల తర్వాత డీఎస్‌ఆర్(డైలీ స్టేషన్ రికార్డు) సేకరిస్తారు. అయితే అప్పటికీ ఏ కేసులూ నమోదు కావు. ఉదయం పత్రికల్లో మాత్రం నమోదైన కేసులు రిపోర్ట్ అవుతాయి. వీటిని చూసి స్పెషల్ బ్రాంచి సిబ్బంది రోజూ అవాక్కవడం పరిపాటే.
ఆయన స్టైలే వేరు
అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లోనే కానిస్టేబుల్‌గా సుదీర్ఘకాలం పని చేసి హెడ్‌కానిస్టేబుల్‌గా ఉద్యోగోన్నతి పొందిన వ్యక్తి రైటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన అధికారపార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈయన స్టైలే వేరు. స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ, ఎస్‌ఐ, తోటి సిబ్బందినీ లెక్క చేయరట. గతంలో బోరుగడ్డ అనిల్ కేసు విషయంలో వీర్‌కు వెళ్ళిన స్టేషన్ అధికారి ఈయనను ఏరి కోరి తెచ్చి స్టేషన్ రైటర్ బాధ్యతలు అప్పగించారట. అప్పటి నుంచి ఈయన బాధితులను రాచిరంపాన పెడుతున్నారని సమాచారం. స్టేషన్ అధికారి కేసు నమోదు చేయాలని చెప్పినా రాత్రి 10.30 గంటల వరకు బాధితులను అక్కడే ఉంచి 11 గంటల తర్వాత కేసు నమోదు చేస్తుంటారని చెబుతున్నారు. ఎవరైనా బాధితులు గట్టిగా ప్రశ్నిస్తే కంప్యూటర్ ఆపరేటర్ లేరని, సిబ్బంది బయటకు వెళ్లారని సాకులు చెబుతారని సమాచారం.
ఆ రెండు స్టేషన్లలో కొత్త రైటర్లు
పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓగా వీరేంద్ర, నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓగా వీరా నాయక్ ఉన్న సమయంలో రైటర్లు పూర్తి హవా నడిపే వారు. స్టేషన్‌కు వచ్చిన బాధితుల ఫిర్యాదులపై రాత్రి 10 గంటలు దాటిన తరువాతే కేసు కట్టేవారు. ఇటీవల ఎస్‌హెచ్‌ఓలు బదిలీ కావడంతో కొత్తగా అధికారులు బాధ్యతలు చేపట్టారు. దీంతో రైటర్లు కూడా మారారు. ఇప్పడు కొత్తగా వచ్చిన వారి తీరు ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి..
బాధితులకు గౌరవం ఇవ్వాలి
ఇటీవల గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని రైటర్లు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశాం. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, బాధితులతో అగౌరవంగా ప్రవర్తించినా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశించాం. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల ఫిర్యాదును పరిశీలించి తక్షణం చర్యలు తీసుకోవాల్సిందే. లేకుంటే కఠిన చర్యలు తప్పవు.
– కె.అరవింద్, డీఎస్పీ, వెస్ట్ సబ్ డివిజన్