
కుటుంబ సంబంధాలు భేషన్న నాటికలు
తెనాలి: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్మారక నాటక కళాపరిషత్, తెనాలి ఆధ్వర్యంలో ఇక్కడి రామలింగేశ్వరపేటలోని ఓపెన్ ఆడిటోరియంలో జరుగుతున్న జాతీయస్థాయి చతుర్ధ ఆహ్వాన నాటికల పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. నాలుగోరోజైన మంగళవారం ప్రదర్శించిన నాటికలు కుటుంబ సంబంధాల ప్రాధాన్యాన్ని చాటాయి. తొలుత అరవింద ఆర్ట్స్, తాడేపల్లి వారి ‘విడాకులు కావాలి’ నాటికను ప్రదర్శించారు. దాంపత్య జీవితంలో దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, చిన్న సమస్యలు తలెత్తటం సహజం, అంతమాత్రాన కలసి బతకలేమన్న తొందరపాటుతో, పంతాలకు పోయి విడాకులు కావాలనుకోవటం ఎంతవరకు సమంజసం అనే అంశాన్ని చర్చించిందీ నాటిక. భారతీయ వివాహ వ్యవస్థలో మన సంస్కృతి, సంప్రదాయాలే సాంసారిక జీవితాలను అన్యోన్యంగా నడిపే దారిదీపాలనీ, ఇచ్చిపుచ్చుకునే సంస్కారం దాంపత్యాన్ని ఆనందమయం చేస్తుందన్న సందేశాన్ని చాటిందీ నాటిక. ప్రముఖ నాటక రచయిత వల్లూరు శివప్రసాద్ రచించిన నాటికను గంగోత్రి సాయి దర్శకత్వంలో ప్రదర్శించారు. అనంతరం ఉషోదయ కళానికేతన్, కట్రపాడు వారి ‘కిడ్నాప్’ నాటికను ప్రదర్శించారు. కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని తెలియజెప్పిందీ నాటిక. స్వార్థజీవనానికి అలవాటు పడుతున్న యువత తల్లిదండ్రులను దూరంగా ఉంచుతున్న తీరును కళ్లకు కట్టారు. వందలకొద్దీ పుస్తకాలు చదివితే వచ్చే విజ్ఞానం, మన ఇళ్లలోని పెద్దవాళ్లు చెప్పే మాటలతోనే వస్తుందని పాత్రలతో చెప్పించారు. చెరుకూరి సాంబశివరావు రచించిన ఈ నాటిక ప్రదర్శనకు ఆయనే దర్శకత్వం వహించారు. చివరగా శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్, గుడివాడ వారి ‘అనశ్వరం’ నాటికను ప్రదర్శించారు. బర్రె సత్యనారాయణ రచించిన నాటికకు ద్వాదశి చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. తొలుత శవ్వా గ్రీష్మశ్రీ కూచిపూడి నృత్యప్రదర్శన ఆహుతుల అభినందనలు అందుకుంది. తెనాలి కళాకారుల సంఘం నిర్వహణలో జరుగుతున్న ఈ నాటికల పోటీలను గౌరవాధ్యక్షుడు ఆరాధ్యుల కన్నా, అధ్యక్షుడు అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి, కార్యదర్శి పిట్టు వెంకటకోటేశ్వరరావు పర్యవేక్షించారు.