
వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి
తెనాలిఅర్బన్: వక్ఫ్ ఆస్తులను కేంద్ర ప్రభు త్వం స్వాధీనం చేసుకునే కుట్ర చేస్తుందని పలువురు ముస్లిం మత పెద్దలు ఆరోపించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మజ్లిసుల్ ఉలమా వల్ అయిమ్మా జమీయతే ఉలమా యే హింద్ లౌకిక వాదులు, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో శుక్ర వారం మధ్యాహ్నం నిరసన, శాంతి ర్యాలీని నిర్వ హించారు. వహాబ్‌చౌక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ సత్యనారాయణ టాకీస్, బోసు రోడ్డు, శివాజీచౌక్ వరకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మతానికి సమానమైన హక్కులు, ప్రాతినిధ్యాన్ని రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన వక్ఫ్ బోర్డును కేంద్ర ప్రభుత్వం సవరణ చేయడం రాజ్యాంగ విలువలను కాలరాయడమేనని ఆరోపించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర స్పందించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో ముస్లిం మతపెద్దలు, వివిధ సంఘాల ముస్లిం నాయకులు, వైఎస్సార్ సీపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, ఎస్‌ఎఫ్‌ఐ, ఎమ్మార్పీఎస్, వివిధ ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తెనాలిలో నిరసన శాంతి ర్యాలీ పెద్ద సంఖ్యలో హాజరైన ముస్లింలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు