
ఆద్యంతం.. సందేశాత్మకం
ఉత్సాహంగా నాటికల పోటీలు
తెనాలి: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్మారక నాటక కళాపరిషత్, తెనాలి ఆధ్వర్యంలో ఇక్కడి రామలింగేశ్వరపేటలోని ఓపెన్ ఆడిటోరియంలో జరుగుతున్న జాతీయస్థాయి చతుర్ధ ఆహ్వాన నాటికల పోటీల్లో భాగంగా చివరిరోజైన శుక్రవారం రెండు నాటికలను ప్రదర్శించారు. తొలుత అభినయ ఆర్ట్స్, గుంటూరు వారి ‘ఇది అతని సంతకం’ నాటికను ప్రదర్శించారు. ప్రతి మనిషి జీవితంలో ఒక గోల్ ఉంటుంది. నిర్దిష్ట ప్రణాళిక ఉంటుంది. సమస్యలను వాటిని ఆచరణలో పెట్టి సాధించుకునేవారి జీవితం పరిపూర్ణమవుతుంది. రాజీపడితే ఆ మనిషి వ్యక్తిత్వం మరణిస్తుంది. సమయస్ఫూర్తితో ఇంటాబయటా నెగ్గుకురాగలిగినవాడే నిజమైన యజమాని అవుతాడు అనే సందేశాన్ని చాటిందీ నాటిక. స్నిగ్ధ రచించిన ఈ నాటికను ఎన్.రవీంద్రరెడ్డి దర్శకత్వంలో ప్రదర్శించారు. ప్రధానమైన కృష్ణమూర్తి పాత్రలో దర్శకుడు ఎన్.రవీంద్రరెడ్డి నటించారు. ఇతర పాత్రల్లో వీసీకేహెచ్ ప్రసాద్, ఎన్.సూర్య, టి.శ్రీలేఖ, కుసుమసాయి నటించారు. సంగీతం లీలామోహన్.
తల్లీబిడ్డల అనుబంధం ‘దేవుడు కనిపించాడు’..
చివరగా శ్రీసాయికార్తీక్ క్రియేషన్, కాకినాడ వారి ‘దేవుడు కనిపించాడు’ నాటికను ప్రదర్శించారు. తల్లీబిడ్డల అనుబంధాన్ని చాటిందీ నాటిక. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను అనాథలుగా వదిలేస్తున్న కొడుకుల కథలను వింటున్న నేటిరోజుల్లో తాను చనిపోతానని తెలిసీ, తల్లికి ఆసరా కోసం కొడుకు పడే వేదన, ఆపరేషన్ చేస్తే ప్రాణానికే ప్రమాదం అని తెలిసినా, కొడుకు కోసం కిడ్నీనే దానం చేసి, కొడుకు ప్రాణాలను దక్కించుకోవటానికి తల్లి పడే ఆవేదనను కళ్లకు కట్టిందీ నాటిక. ఊపిరున్నంతవరకు విడదీయలేనివీ అనుబంధాలు మరచిపోకూడదన్న సందేశాన్నిచ్చిందీ నాటిక. డాక్టర్ సింహప్రసాద్ మూలకథకు మార్కొండ దుర్గాప్రసాద్ నాటకీకరించారు. చట్రా విజయలక్ష్మీ మహేష్ దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రల్లో శ్రీలేఖ, సీహెచ్ మహేష్, డి.రఘుబాబు, మార్కొండ దుర్గాప్రసాద్, ఎన్.కృష్ణకాంత్, కొప్పుల శ్రీనివాసరావు నటించారు. సంగీతం రమణ. తొలుత నృత్యగురువులు ఆలపాటి ప్రజ్ఞ, చిలకలపూడి ముకుందప్రియ శిష్యబృందాలు కూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించారు. తెనాలి కళాకారుల సంఘం నిర్వహణలో జరిగిన ఈ నాటికల పోటీలను గౌరవాధ్యక్షుడు ఆరాధ్యుల కన్నా, అధ్యక్షుడు అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి పర్యవేక్షించారు.
70 గ్రాముల బంగారం చోరీ
కాజ(మంగళగిరి): కాజ రామాలయం సెంటర్‌లో చోరీ ఘటన చోటు చేసుకుంది. రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. కాజ రామాలయం సెంటర్‌లో ఉంటున్న ఆర్ధల నిర్మల కుమారుడు, కుమార్తెలు హైదరాబాద్‌లో ఉంటున్నారు. నిర్మల 15 రోజుల క్రితం హైదరాబాద్ వెల్లింది. గురువారం సాయంత్రం ఇంటి పక్కన ఉన్న వారు చూడగా తలుపులు తీసి ఉన్నట్లు చూసి హైదరాబాద్ ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో శనివారం హైదరాబాద్ నుంచి కాజ చేరుకుని ఇంటిలోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగలగొట్టి అందులోని బంగారం బిస్కెట్లు ఐదు, కొన్ని బంగారు వస్తువులు మొత్త 70 గ్రాములు బంగారం చోరీకి గురైందని తెలుసుకున్నారు. రూరల్ స్టేషన్‌కు చేరుకుని నిర్మల ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.