
ప్రత్యేక రైళ్ల కేటాయింపు
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్ల కేటాయించడం జరిగిందని గుంటూరు డివిజన్ సీనియర్ డీసీయం ప్రదీప్ కుమార్ బుధవారం తెలిపారు. రైలు నంబర్ 08579 విశాఖపట్నం – చర్లపల్లి రైలు ఈ నెల 25 నుంచి మే 30వ తేదీ వరకు నడుస్తుందన్నారు. 08580 చర్లపల్లి – విశాఖపట్నం రైలు ఈ నెల 26 నుంచి మే 31వ తేదీ వరకు నడపనున్నట్లు తెలిపారు. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కై కలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదుగా ప్రయాణిస్తుందని పేర్కొన్నారు.
వైభవంగా సీతారాముల విగ్రహ ప్రతిష్టా మహోత్సవం
అమరావతి: మండలంలోని ఎనికపాడు గ్రామంలో హనుమత్, లక్ష్మణ సీతాసమేత రామచంద్రస్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. యాజ్ఞిక బ్రహ్మ పరాశరం రామకృష్ణమాచార్యుల పర్యవేక్షణలో వైఖానసాగమంలో చంచాహ్నికహ్నిక దీక్షతో ఉత్సవాలను నిర్వహించారు. ప్రతిష్టా సుముహుర్తమైన 8గంటలకు తొలుత యంత్ర స్థాపనచేసి యాగశాల నుంచి స్వామివార్లను ఊరేగింపుగా తీసుకుని వచ్చి నూతనంగా నిర్మించిన ఆలయంలో ప్రతిష్టించారు. అనంతరం అత్యంత వైభవంగా జీవధ్వజ ప్రతిష్టాకార్యక్రమం నిర్వహంచారు. ఈసందర్భంగా మహా పూర్ణాహుతి, కుంభప్రోక్షణ మహా సమారాధన నిర్వహించారు. ఽవిగ్రహ ప్రతిష్ట అనంతరం మొదట ధేను దర్శనం, దిష్టికుంభం, కన్యాదర్శనం అనంతరం ప్రథమార్చన నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం దేవాలయ నిర్వాహకులచే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిష్టా ఉత్సవాలతో గ్రామం భక్తులతో కళకళలాడింది. భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌లు కుటుంబసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రంగాకాలనీలో పోలీసుల కార్డెన్ సెర్చ్
సత్తెనపల్లి: సత్తెనపల్లి పట్టణంలోని రంగా కాలనీలో బుధవారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతురావు మాట్లాడుతూ రంగా కాలనీలో ఇటీవల చోటు చేసుకుంటున్న గొడవల నేపథ్యంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగిందన్నారు. ఉద్దేశపూర్వకంగా ఘర్షణలకు పాల్పడిన వారిని జైలుకు పంపుతామని హెచ్చరికలు చేశారు. ఒక్కసారిగా 100 మందికి పైగా పోలీసులు ఇంటింటి తనిఖీలు చేపట్టడంతో రంగాకాలనీలో ఏదో జరిగిందంటూ కొంత సేపు కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు. 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటిని పోలీస్టేషన్‌కు తరలించారు.

ప్రత్యేక రైళ్ల కేటాయింపు