కాంట్రాక్ట్‌లు, ఉద్యోగాలు ఇప్పిస్తానని వైద్యుడి ఘరానా మోసం | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌లు, ఉద్యోగాలు ఇప్పిస్తానని వైద్యుడి ఘరానా మోసం

Published Tue, Mar 4 2025 1:36 AM | Last Updated on Tue, Mar 4 2025 1:36 AM

-

జనగామ : ప్రభుత్వ ఉద్యోగాలు, బిల్డింగ్‌ కాంట్రాక్ట్‌ పనులు ఇప్పిస్తానని రూ. రూ.5.56 కోట్ల మేర వసూలు చేసి మోహం చాటేసిన వైద్యుడిని సోమవారం అరెస్ట్‌ చేసినట్లు జనగామ సీఐ దామోదర్‌రెడ్డి తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. జనగామ జిల్లా కేంద్రంలోని కేకే ఆస్పత్రి వైద్యుడు అబ్దుల్‌ రహీం సుల్తాన్‌.. రాజ టిప్పుసుల్తాన్‌ వారసుడితో పాటు ట్రస్ట్‌ చైర్మన్‌గా ప్రచారం చేసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు తాను టిప్పు సుల్తాన్‌ వారసుడినని పరిచయం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో జిల్లా కేంద్రానికి చెందిన ఎలక్ట్రికల్‌ కాంట్రాక్టర్‌ ఎండి. వసీం అక్తర్‌తో స్నేహం ఏర్పరుచుకున్నాడు. టిప్పు సుల్తాన్‌ ట్రస్ట్‌కు కర్ణాటక ప్రభుత్వం నుంచి రూ.7 వందల కోట్లు వస్తున్నాయని, ఇందుకు జీఎస్‌టీ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుందని వసీం అక్తర్‌ను నమ్మించి అతడి వద్ద రూ.1.17 కోట్లు తీసుకున్నాడు. ఇందుకు బహుమానంగా నెలరోజుల్లో జనగామలో తాను నిర్మాణం చేసే మెడికల్‌ కళాశాల బిల్డింగ్‌, ఎలక్ట్రికల్‌ కాంట్రాక్టును ఇప్పిస్తానని చెప్పడంతో వసీం అక్తర్‌ పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చాడు. 2021లో ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మేకల ఆనంద్‌కుమార్‌ వద్ద రూ.3.75లక్షలు, గాదెపాక రాజ్‌కుమార్‌ వద్ద రూ. 5.50 లక్షలు, సిద్ధార్థ వద్ద రూ.5.50 లక్షలు తీసుకున్నాడు. కేకే ఆస్పత్రిలో ఉన్న ఎక్స్‌రే మిషన్‌, 10 బెడ్లు, ప్రింటర్లు, కంప్యూటర్లు, ఇతర మెడికల్‌ పరికరాలను ఇస్తామని చెప్పి పట్టణానికి చెందిన మారబోయిన పాండు వద్ద 2023లో రూ.5లక్షలు తీసుకున్నాడు. అలాగే, హైదరాబాద్‌కు చెందిన ఎస్‌వీఎన్‌ చారి నుంచి రూ.1.70కోట్లు, ఏ.రాజు నుంచి రూ.50లక్షలు, 2014లో కరీంనగర్‌కు చెందిన సీహెచ్‌ అనిల్‌ వద్ద రూ.2 కోట్లు తీసుకుని మోసం చేశాడు. మొత్తం రూ.5కోట్ల56లక్షల75వేల మోసానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు డీసీపీ రాజమహేంద్రనాయక్‌ ఆదేశాల మేరకు ఏసీపీ చేతన్‌ నితిన్‌ పండరి పర్యవేక్షణలో సదరు వైద్యుడిని అరెస్ట్‌ చేసినట్లు సీఐ దామోదర్‌ రెడ్డి తెలిపారు. లాటరీ, ఉద్యోగాల పేరిట డబ్బులు అడిగితే ఇచ్చి మోసపోవద్దని సీఐ ప్రజలకు సూచించారు.

రూ.5.56 కోట్ల మేర వసూలు

వివరాలు వెల్లడించిన సీఐ దామోదర్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement