
వాగ్దేవి కళాశాల పీజీ సెమిస్టర్ ఫలితాల విడుదల
హన్మకొండ: కాకతీయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాల (అటానమస్) పీజీ ఒకటో సెమిస్టర్ ఫలితాలను గురువారం విడుదల చేశారు. పరీక్షలను ఫిబ్రవరిలో నిర్వహించగా.. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.శేషాచలం, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ హరీందర్ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామిషన్స్ సి.దత్తాత్రేయ గురువారం హనుమకొండ నయీంనగర్‌లోని కళాశాలలో ఫలితాలను విడుదల చేశారు. వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగాల్లో మొత్తం 112 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 95 మంది (84.82% ) ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఎంకామ్ (కంప్యూటర్ అప్లికేషన్స్), ఎమ్మెస్సీ (న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్)లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఎమ్మెస్సీ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) 97.06 శాతం, ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) 87.50 శాతం, ఎమ్మెస్సీ (డేటా సైన్స్) 85.71 శాతం, ఎమ్మెస్సీ (మైక్రోబయాలజీ) 84.62 శాతం ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ శేషాచలం అభినందనలు తెలిపారు.
ఆర్ట్స్ కాలేజీలో
పాలమూరు సాహితీవేత్తలు
కేయూ క్యాంపస్: మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 22మంది తెలుగు సాహితీవేత్తలు గురువారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీని సందర్శించారు. వరంగల్‌లోని ప్రముఖ సాహిత్యకారుల జన్మస్థలాలు, నివాసస్థలాల సందర్శనలో భాగంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మొదటి ప్రిన్సిపాల్, ప్రముఖ సాహితీవేత్త ఆచార్య రాయపోలు సుబ్బారావు పనిచేసిన చోటును సందర్శించినట్లు వారు తెలిపారు. సాహిత్యకారుల వెంట మాజీ ప్రిన్సిపాల్, రిటైర్డ్ ఆచార్యులు బన్న అయిలయ్య, సాహితీవేత్తలు రామశాస్త్రి, వీఆర్ విద్యార్థి, ఉన్నారు. ఆర్ట్స్ కాలేజీ గొప్పతనాన్ని బన్న అయిలయ్య వారికి వివరించారు. ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి విద్యాకేంద్రమైన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందన్నారు. అంతకుముందు పాలమూరు సాహితీవేత్తలకు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ స్వాగతం పలికారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ గిరిప్రసాద్, డాక్టర్ ఆదిరెడ్డి, డాక్టర్ హరికుమార్ తదితరులు ఉన్నారు.

వాగ్దేవి కళాశాల పీజీ సెమిస్టర్ ఫలితాల విడుదల