
విభిన్న రకాల వీడియో ఆధారిత యాప్స్‌కు ఊపునిచ్చిన టిక్‌టాక్ బ్యాన్ అయ్యాక మరికొన్ని అచ్చమైన భారతీయ వీడియో వేదికలు తెరమీదకి వచ్చాయి. అప్పుడే వాటిని అందిపుచ్చేసుకున్న టాలెంటెడ్ యూత్ తమదైన శైలిలో సందడి చేస్తోంది. ఈ తరహా వినోదాన్ని పండించే వారిలో వ్యక్తిగతంగా లేదా స్నేహ బృందాలతో కలిసి సందడి చేసేవారే ఎక్కువ. అయితే తమ మాతృమూర్తితో కలిసి వీక్షకులను ఉర్రూతలూగించేవారు తక్కువ.
అలాంటి యువకుడే హైదరాబాద్‌కి చెందిన సంతోష్ కాసర్ల... ఇటీవలే టిక్‌టాక్ ప్లేస్‌లో అందుబాటులోకి వచ్చిన వీడియో ఆధారిత ప్లాట్‌ఫామ్ మోజ్‌లో ఈ కుర్రాడు తన సత్తా చాటుతున్నాడు. అమ్మతో ఈ కుర్రాడు చేసిన వీడియోలకు ఎంత క్రేజ్ వచ్చిందంటే.. వీరిద్దరినీ పెట్టి ఒక సంస్థ అమ్మ ప్రేమ అనే షార్ట్ ఫిలిం కూడా రూపొందించింది. అతి తక్కువ వ్యవధిలో దాదాపు 10లక్షల మంది ఫాలోయర్లను దక్కించుకుని మోజ్‌పై క్రేజీగా మారాడు. ఈ సందర్భంగా సంతోష్ ‘సాక్షి’తో ముచ్చటించాడు.
నటన కోసం నేను... నా కోసం అమ్మ...
మాది వరంగల్. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఉంటున్నా. ఈస్ట్ మారేడ్ పల్లిలోని గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రింటింగ్ టెక్నాలజీలో డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ చేస్తున్నా. చిన్న వయసు నుంచీ కూడా నేనెప్పుడూ ఒక మంచి నటుడిని కావాలని కోరుకున్నా. అయితే అది లాంగ్ జర్నీ అని తెలుసు. అయినా ఏదోలా ప్రపంచానికి నా అభినయ ప్రతిభ పరిచయం కావాలనుకున్నా. చిన్న చిన్న వీడియోల ద్వారా నా యాక్టింగ్ టాలెంట్‌ని చూపిస్తూ వచ్చా యూజర్స్ బాగా రెస్పాండ్ అయ్యారు.
అయితే అందరూ చేస్తున్నట్టు కాకుండా విభిన్నమైన రీతిలో ఏమైనా చేయాలని అనిపించింది. అదే సమయంలో అమ్మతో టీనేజ్ కొడుకుకున్న అనుబంధం ప్రతిబింబిస్తూ.. నేచురల్‌గా ఏ ఇంట్లో అయినా తల్లీ కొడుకుల మధ్య జరిగే కొన్ని సరదా సన్నివేశాలతో చేద్దామని అనిపించింది. నిజానికి అమ్మకి అలాంటివి అప్పటిదాకా పరిచయం లేదు. అయినా నా ఇంట్రెస్ట్‌ని తగ్గించడం ఇష్టం లేక... సరే అంది. అమ్మ చదువుకోలేదు. నటించడం ఎలా రా? అని అడిగితే..‘‘ నటించడం ఏమీ వద్దు అమ్మా... నువ్వు నాతో ఎలా రెగ్యులర్‌గా ఇంట్లో ఉంటావో అలాగే ఉండు’’ అని చెప్పా. అలాగే చేస్తోంది.
మామ్ అండ్ మీ...
అప్పటి నుంచి అమ్మతో కలిసి వీడియోస్ చేయడం మొదలుపెట్టా. ఇది వ్యూయర్స్‌ని బాగా ఆకట్టుకుంది. మరిన్ని ఇవే తరహాలో పోస్ట్ చేయమని ఎంకరేజ్ చేశారు. అంతకు ముందు మరికొన్నింటిలో కూడా చేశా కానీ... ఇంత రెస్పాన్స్ రాలేదు. కేవలం సినిమా కామెడీ బిట్స్ మాత్రమే కాకుండా ఓరిజనల్ కంటెంట్, కాన్సెప్ట్స్‌తో కూడా వీడియోలు తీస్తుండడం తో నాకు పెద్ద సంఖ్యలో ఫాలోయర్లు వచ్చారు. అలాగే వీడియోస్‌కి వ్యూస్‌కూడా బాగా పెరిగాయి. దాంతో పలు సంస్థలకు ప్రమోషన్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి.
ప్రస్తుతం థోనీ చేస్తున్న ఖాతా బుక్ యాడ్ కమర్షియల్‌కు కూడా చేశా. ఫాలోయర్స్ తో పాటు మన వీడియోస్‌కి వ్యూస్ ఎన్ని వస్తున్నాయి? ఎంత లైక్ చేస్తున్నారు? అనేది చూసి ఈ యాడ్స్ వస్తుంటాయి. ఈ ఇన్‌కమ్ కూడా నాకు ఇంట్లో అవసరాలకు కొంత యూజ్ అవుతోంది. దీనికి తోడుగా బయట కూడా చాలా మంది నన్ను గుర్తు పడుతున్నారు. సెల్ఫీలు అడుగుతున్నారు. షార్ట్ ఫిలింస్ లో కూడా బాగానే ఛాన్సెస్ వస్తున్నాయి. ఏదేమైనా.. ఈ వేదిక ఆధారంగా నా సినిమా కలల్ని సాకారం చేసుకోగలననే అనుకుంటున్నా.