సాక్షి, హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేటలో కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందడం, దానిపై నగర మేయర్ విజయలక్ష్మి స్పందించిన తీరు పట్ల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వరుస ట్వీట్లను సంధించారు. ‘పాపం నిరుపేద కుక్కలు వేరే దారి లేక ఆకలి తాళలేక 4 ఏళ్ల బాలుడిని చంపేశాయని మేయర్ అనడం షాకింగ్‌గా.. నమ్మశక్యం కాని విధంగా ఉంది. హృదయాన్ని పిండేస్తున్న బాలుడి వీడియో రిపీటెడ్‌గా నగర మేయర్‌కి చూపించాలి.
మేయర్ తన పెట్ డాగ్స్‌కు తినిపిస్తున్న పాత వీడియోను ఆయన షేర్ చేసి...ఈ వీడియోని నగరంలో ఉన్న కుక్కలన్నింటికీ చూపిస్తే.. పిల్లల్ని చంపే బదులు, తమకు ఆకలి వేసినప్పుడు అవి నేరుగా ఆమె ఇంటికి వెళ్లవచ్చు. ఈ ఘటన అనంతరం మేయర్‌గా రిజైన్ చేసి అన్ని కుక్కలను మీ ఇంటికి తీసుకెళ్లి స్వయంగా వాటికి తినిపించవచ్చు కదా? అప్పుడు అవి మా పిల్లల్ని తినవు కదా’ అని వ్యంగాస్త్రాలు విసిరారు.
‘నగరంలోని మొత్తం 5 లక్షల కుక్కల్ని ఒక డాగ్ హోమ్‌లో రౌండప్ చేయండి’ అంటూ రాష్ట్ర ప్రభుత్వాధినేతలను అభ్యర్థించారు. కుక్కల అంశంపై గురువారం సమావేశం పెట్టామని, చర్చించాం అని మేయర్ చెప్పడంపై స్పందిస్తూ..‘ఏ రకమైన ముగింపునకు వచ్చారు మీరు? అకౌంటబిలిటీ కోసం దీన్ని మీరు పాయింట్ టు పాయింట్ ట్విట్టర్‌లో పెట్టగలరా?’ అని ప్రశ్నించారు. హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించడంపై ఉపశమనంగా ఉంది’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.
– సాక్షి, సిటీబ్యూరో
Comments
Please login to add a commentAdd a comment