హైదరాబాద్:గత కొన్ని సంవత్సరాలుగా నగరంలోని తెలంగాణ కళాభారతి (ఎన్‌టీఆర్ స్టేడియం) వేదికగా డిసెంబర్ నెలలో ‘హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్’ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం విదితమే. తెలుగుతో పాటు ఇతర భాషల పుస్తక పఠనాన్ని పెంపొందించడం, నూతన రచయితలను, యువ సాహిత్య అభిలాషకులను ప్రోత్సహించడంలో ఈ వేదిక ప్రశస్తిని పెంచుకుంది. నగరంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది సాహిత్య ప్రియులు ఈ పుస్తక ప్రదర్శనలో పాల్గొంటున్నారు.
అయితే ఈసారి రాష్ట్ర శాసనసభ ఎన్నికలతో పాటు వేర్వేరు కారణాలతో 36వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ ఏర్పాట్లకు ఆమోదం లభించలేదు. దీంతో బుక్ ఫెయిర్ కోసం ఎదురు చూసిన సాహితీవేత్తలు, పుస్తకప్రియుల్లో నిరాశ నెలకొంది. ప్రతి ఏటా బుక్ ఫెయిర్‌లో నూతన పుస్తకాలను, కొత్త ఎడిషన్‌లను ఆవిష్కరించడం ఆనవాయితీ. ఈ తరంలో అంతర్జాతీయ స్థాయి వరకు ప్రఖ్యాతిగాంచిన అన్నిరకాల పుస్తకాలు ఆన్‌లైన్ వేదికగా లభిస్తున్నాయి. కానీ బుక్ ఫెయిర్ సందర్భంగా నూతన పుస్తకాలను ఆవిష్కరిస్తే ఎక్కువ మంది పాఠకులకు చేరువవ్వడంతో పాటు రచనలకు, రచయితలకు మంచి వేదికగానూ నిలుస్తోంది.
స్థానికంగానే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి పలు ప్రచురణ సంస్థలు తమ స్టాల్స్‌ను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేస్తుంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కూడా ఏర్పాటు కానుండటంతో బుక్‌ఫెయిర్‌పై అనిశ్చితి ఏర్పడింది. అయితే, డిసెంబర్‌లో పుస్తక ప్రదర్శన నిర్వహించలేకపోయినప్పటికీ మరో రెండు నెలల్లో నిర్వహించే అవకాశముందని నిర్వాహకులు తెలిపారు. ప్రదర్శన నిర్వహణ కోసం ఎన్‌టీఆర్ స్టేడియంను బుక్ చేయలేదని, దీనిపైన స్పష్టత రాగానే పూర్తి వివరాలను తెలియజేస్తామని వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment