సాక్షి, మేడ్చల్ జిల్లా: గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలోనే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నాయి. అయితే పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం వెల్లడించకపోవటంతో వాయిదా పడతాయేమోనని పంచాయతీ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే...గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన అమల్లోకి రాగలదని పేర్కొంటున్నారు.
నగర శివారుల్లో 619 పంచాయతీలు
నగర శివారు మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 619 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 61 గ్రామ పంచాయతీల పరిధిలోని 606 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు 800 పోలింగ్‌స్టేషన్లు, 1000 బ్యాలెట్ బాక్సులు, 2 వేల మంది సిబ్బంది.. అలాగే, రంగారెడ్డి జిల్లాలోని 558 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు 3 వేల పోలింగ్ స్టేషన్లు, 3,500 మంది సిబ్బందిపై అంచనాతో అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
జీపీల్లో రాజకీయ వేడి..
ఈ ఏడాదిలో పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో గ్రామాల్లో రాజకీయ వేడి మొదలైంది. పార్లమెంటు, పంచాయతీ, మండల, జిల్లా ప్రాదేశిక స్థానాలకు ఎన్నికలు వరుసగా జరిగే అవకాశముంది. దీంతో ఏడాదంతా నగర శివారు మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్నికల పండుగ వాతావరణం నెలకొననుంది. తొలుత జరిగే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు ఇప్పటి నుంచే గ్రామాల్లో ప్రచార కసరత్తుకు సన్నాహాలు చేస్తున్నారు. పార్టీల నాయకులు కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిసారిస్తున్నారు. ఎన్నికలు పార్టీల గుర్తులపై జరగకున్నా,.. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రధాన పార్టీల అండదండలతోనే అభ్యర్థులు బరిలో నిల్చుంటారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో తాము పడిన కష్టానికి ప్రతిఫలంగా తగిన సహకారాన్ని అందించాలని ఆశావహులు నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు.
రిజర్వేషన్లపై తర్జన భర్జన..
కొత్త ప్రభుత్వం కొలువు దీరిన నేపథ్యంలో గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లపై తర్జనభర్జన జరుగుతోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన శ్రీపంచాయతీ రాజ్ చట్టం – 2019 ప్రకారం పంచాయతీల్లో రిజర్వేషన్లు పదేళ్ల పాటు వర్తిస్తాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తుందా? లేక ఏమైనా మార్పులు చేస్తుందా? అనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒకవేళ చట్టంలో మార్పులు చేస్తే జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించే అవకాశముంటోంది. ఇందుకోసం ప్రస్తుత చట్టాన్ని మార్చాల్సి ఉంది. ఇది జరగాలంటే మరో కొత్త చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. ఆపై ఆమోదం పొందాలి. ఇంత ప్రక్రియ జరగాలంటే మరింత సమయం పడుతుంది.ఇప్పుడు అంత సమయం లేదు. ఈ నేపధ్యంలోనే పంచాయతీ ఎన్నికలు సకాలంలో జరగకపోవచ్చు! అనే అభిప్రాయాన్ని అధికార వర్గాలతోపాటు రాజకీయ పార్టీల్లో వ్యక్తమవుతోంది.
‘బ్యాలెట్ పోరు’..ప్రహసనం
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితానే ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే. దాన్ని పంచాయతీలు, వార్డుల వారీగా విభజించాల్సి ఉంటోంది. కొత్తగా అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన జరిపి తుది జాబితా వెల్లడించడం తప్పనిసరి చేయాల్సి ఉంది. ఎన్నికలు నిర్వహణకు బ్యాలెట్ బాక్సులు సేకరించాలి. బ్యాలెట్ పత్రాలను ముద్రించాల్సి ఉంది. ఇదంతా జరగాలంటే ఇప్పుడున్న సమయం ఏమాత్రం సరిపోదన్న అభిప్రాయం ఎన్నికల అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ఎటు చూసినా ఎన్నికల నిర్వహణ సాధ్యమా? అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన అమలులోకి రావడం ఖాయమని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment