![ఇంట్ల](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06sec53-160062_mr-1738894391-0.jpg.webp?itok=87gZ7o0H)
ఇంట్లోకి చొరబడి..కత్తులతో పొడిచి..
చిలకలగూడ: ఓ ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు తల్లి కొడుకుపై కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం చిలకలగూడ ఠాణా పరిధిలోని మెట్టుగూడలో చోటుచేసుకుంది. . తల్లి అపస్మారకస్థితిలో ఉండగా, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఎవరు, ఎందుకు దాడికి పాల్పడ్డారో తెలియరాలేదు. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మెట్టుగూడ నల్లపోచమ్మ ఆలయ సమీపంలో రేణుక, శేఖర్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమారులు యశ్వంత్, యశ్పాల్, వినయ్ ఉన్నారు. ఏజీ కార్యాలయంలో పనిచేసే శేఖర్ మూడేళ్ల క్రితం మృతిచెందాడు. రేణుక, తన ముగ్గురు కుమారులు, మంచానికే పరిమితమైన అత్త (శేఖర్ తల్లి) అనసూయ (70) కలిసి ఉంటున్నారు. మౌలాలీలోని ఓ రైల్వే కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్న యశ్వత్ గత మూడు నెలలుగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. యశ్పాల్, వినయ్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. గురువారం ఉదయం యశ్పాల్, వినయ్ డ్యూటీకి వెళ్లగా యశ్వంత్, తల్లి రేణుక ఇంట్లోనే ఉన్నారు. ఉదయం 11.30 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు రేణుక, యశ్వంత్‌లపై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసిన అనంతరం బయట తలుపులకు గడియపెట్టి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన వారి కేకలు విన్న స్థానికులు తలుపులు తెరిచి చూడగా ఇద్దరూ రక్తపు మడుగులో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. రేణుక కడుపుపై రెండు, యశ్వంత్ కడుపుపై మూడు కత్తిపోట్లు ఉన్నాయి. రేణుక అపస్మారకస్థితిలో ఉండగా, యశ్వంత్ పరిస్థితి విషమంగా ఉందని, వారికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు.
పథకం ప్రకారమే దాడి..
తాము ఇంట్లో లేని సమయం చూసి పథకం ప్రకారమే దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారని రేణుక మూడో కుమారుడు వినయ్ తెలిపాడు. తమకు ఎవరితోనూ శతృత్వం లేదన్నాడు. ఎవరు ఎందుకు దాడి చేశారో తెలియడం లేదని, ఆరుగురు వ్యక్తులు దాడిలో పాల్గొన్నారని, నలుగురు ఇంట్లోకి చొరబడి దాడి చేయగా, ఇద్దరు బయటే ఉన్నట్లు తెలిపాడు.
సవాల్‌గా తీసుకున్న పోలీసులు...
హత్యాయత్నంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య, చిలకలగూడ ఏసీపీ జైపాల్‌రెడ్డి, చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ అనుదీప్, డీఐ రమేష్‌గౌడ్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్‌స్వాడ్ ఆధారాలు సేకరించారు. రక్తపు మరకలతో ఉన్న పదునైన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనలో దుండగులను ప్రత్యక్షంగా చూసిన వారు లేకపోవడం గమనార్హం.
బాధితులు నోరు విప్పితేనే...
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు కోలుకుని నోరువిప్పితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య, చిలకలగూడ ఏసీపీ జైపాల్‌రెడ్డి తెలిపారు. దుండగులను కేవలం బాధితులు మాత్రమే చూశాన్నారు. అన్ని కోణాల్లోను దర్యాప్తు చేపట్టామని, త్వరలోనే మిస్టరీని చేధిస్తామన్నారు.
తల్లీకుమారుడిపై హత్యాయత్నం
తీవ్రగాయాలతో గాంధీలో చికిత్స
కుమారుడు యశ్వంత్ పరిస్థితి విషమం
అపస్మారకస్థితిలో తల్లి రేణుక
ఎవరు, ఎందుకు దాడి చేశారో తెలియని వైనం
బాధితులు కోలుకుని నోరు విప్పితేనే వాస్తవాలు వెలుగులోకి
దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ఆధారాల సేకరణ
![ఇంట్లోకి చొరబడి..కత్తులతో పొడిచి.. 1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06sec51-160062_mr-1738894391-1.jpg)
ఇంట్లోకి చొరబడి..కత్తులతో పొడిచి..
![ఇంట్లోకి చొరబడి..కత్తులతో పొడిచి.. 2](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06sec50-160062_mr-1738894391-2.jpg)
ఇంట్లోకి చొరబడి..కత్తులతో పొడిచి..
![ఇంట్లోకి చొరబడి..కత్తులతో పొడిచి.. 3](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06sec52-160062_mr-1738894391-3.jpg)
ఇంట్లోకి చొరబడి..కత్తులతో పొడిచి..
Comments
Please login to add a commentAdd a comment