‘తెలంగాణ’ను  మోదీ వద్దన్నారు | Jairam Ramesh said that Modi does not want Telangana | Sakshi
Sakshi News home page

‘తెలంగాణ’ను  మోదీ వద్దన్నారు

Published Tue, Nov 28 2023 7:43 AM | Last Updated on Tue, Nov 28 2023 7:43 AM

Jairam Ramesh said that Modi does not want Telangana - Sakshi

రాష్ట్రం బిల్లు పార్లమెంటులో పెట్టడం ఆయనకిష్టం లేదు. సుష్మా, రాజ్‌నాథ్, వెంకయ్య, అరుణ్‌జైట్లీలకు ఫోన్‌ చేసి ఒప్పుకోవద్దని ఒత్తిడి తెచ్చారు. ఈ విషయం ఇప్పటివరకు  చాలామందికి తెలియదు.  ఐదు రాష్ట్రాల ఫలితాలతో దేశ  రాజకీయాల్లో పెద్ద మార్పు వస్తుంది. తెలంగాణలో రెండు రేసుగుర్రాల మధ్య పోటీ జరుగుతోంది జోడోయాత్ర తర్వాత ఇక్కడ బీజేపీ కనుమరుగు కావడం ప్రారంభమైంది. గెలుపు మాదే... బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం టీంను ఓడిస్తాం -కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌ 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రధాని మోదీకి ససేమిరా ఇష్టం లేదని, పార్లమెంటులో ఆ బిల్లు పెట్టేందుకు అంగీకరించవద్దని నాటి గుజరాత్‌ సీఎం హోదాలో ఆయన బీజేపీ అగ్రనేతలు సుష్మాస్వరాజ్, రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీలపై ఒత్తిడి తెచ్చారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయం ఇప్పటివరకు చాలా మందికి తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో జాతీయ స్థాయి కలలు కంటూ పార్టీ పేరు మార్చు­కున్న బీఆర్‌ఎస్‌తో పోరాడుతున్నామని, ఇక్కడ రెండు రేసుగుర్రాల మధ్య పోటీ జరుగుతోందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో దేశంలో రాజకీయంగా పెద్ద మార్పు వస్తుందని దీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు వచ్చిన జైరాం రమేశ్‌ గాందీభవన్‌లో ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు, తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన, భారత్‌ జోడో యాత్ర ప్రభావం, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి వ్యూహం తదితర అంశాలపై ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలివి! 

ఇవి సెమీ ఫైనల్స్‌ కావు... అవి ఫైనల్స్‌ కావు 
‘ఐదు రాష్ట్రాల ఎన్నికలు సెమీఫైనల్స్‌ అని, సెమీఫైనల్స్‌లో గెలిచి ఫైనల్స్‌లో కూడా గెలుస్తామని నేను చెప్పను. కానీ ఈ ఫలితాల తర్వాత దేశ రాజకీయాల్లో పెద్ద మార్పు వస్తుంది. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో మళ్లీ మా ప్రభుత్వాలకు ప్రజామోదం వస్తుంది. మధ్యప్రదేశ్, తెలంగాణలోని ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకత మమ్మల్ని గెలిపిస్తుంది. మిజోరంలో ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. మిగిలిన వాటిలో మాత్రం 4–0తో గెలుస్తున్నాం. ఆ మూడు రాష్ట్రాల్లో మేం బీజేపీతో మాత్రమే కాదు.. ఈడీ, సీబీఐలతో పాటు ప్రధాని మోదీ దాడులు, తిట్లు, నిందారోపణలతో పోరాడుతున్నాం. అయినా గెలుస్తాం. తెలంగాణలో జాతీయస్థాయి కలలు కంటున్న బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం కూటమితో పోరాడుతున్నాం. ఆ మూడు పార్టీల టీంను ఓడించి కచ్చితంగా గెలుస్తాం. 

జోడేగా భారత్‌.. జీతేగా ఇండియా 
ప్రస్తుతం మా దృష్టంతా ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే ఉంది. ఈ ఎన్నికలైన తర్వాత ఇండియా కూటమి మళ్లీ సమావేశమవుతుంది. కనీస ఉమ్మడి కార్యాచరణను రూపొందించుకుంటుంది. సీట్ల పంపకాలతో పాటు సమష్టి వ్యూహాన్ని రూపొందించుకుంటాం. ఇండియా కూటమికి కావాల్సింది బలహీన కాంగ్రెస్‌ కాదు. బలమైన కాంగ్రెస్‌ ఉంటేనే కూటమి ముందుకెళుతుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత దేశ రాజకీయాల్లో పెద్ద మార్పు వస్తుంది.  

గత 15 నెలలుగా పుంజుకున్నాం 
తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ 15 నెలలుగా పుంజుకుంటోంది. భారత్‌జోడో యాత్రకు ముందు తెలంగాణలో భిన్న రాజకీయ వాతావరణం ఉంది. బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ అన్నట్టు అప్పుడు ఉండేది. రాష్ట్రంలోని 8 జిల్లాలు, 12 రోజులు, 405 కిలోమీటర్ల పాటు రాహుల్‌గాందీ తిరిగిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. దీంతో తెలంగాణలో బీజేపీ కనుమరుగు కావడం ప్రారంభమైంది. ఇప్పు­డు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ అనే రెండు రేసు గుర్రాల మధ్య పోటీ జరుగుతోంది. 

ఆ నాలుగు నెరవేరలేదు
తెలంగాణ ఏర్పాటుకు ముందు సంపదనంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకరించారని అనేవారు. కానీ రాష్ట్రం ఏర్పాటయిన తొమ్మిది, పదేళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి ఉంది. రాజకీయ అధికార పంపిణీ కోసం తెలంగాణ కావాలని అడిగారు. కానీ ఇప్పుడు తెలంగాణలో సీఎం, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడి చేతిలోనే రాజకీయ అధికారం ఉంది. ఉద్యోగాలు రావడం లేదని తెలంగాణ అడిగారు. ముల్కీలకు ఉపాధి కోసం ఉద్యమం నడిపారు. కానీ ఇప్పుడు తొమ్మిదేళ్ల తర్వాత నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచింది. సామాజిక న్యాయం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ వచ్చింది. కానీ, ఫామ్‌హౌస్‌ పాలనలో దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, బీసీల ఆకాంక్షలకు స్థానం లేకుండా పోయింది. తెలంగాణ ఏర్పాటయిన తర్వాత కూడా ఆ నాలుగు ఆకాంక్షలు నెరవేరలేదు.

పదేళ్లు చాలా ఎక్కువ సమయం 
తెలంగాణ అభివృద్ధి విషయంలో పదేళ్లు అంటే చాలా ఎక్కువ సమయం. బీఆర్‌ఎస్‌ నిరంకుశ వైఖరి కారణంగా రాష్ట్రం అలాగే ఉండిపోయింది. ఎనిమిదో ని­జాంలాగా కేసీఆర్‌ పాలిస్తున్నాడు. కేటీఆర్‌ తొమ్మిదో నిజాం అవుతాడు. కవిత తొలి మహిళా నిజాం అయినా ఆశ్చర్యం లేదు. సామాజిక, ఆర్థికాభివృద్ధి పునాదులపై జరిగిన తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు ఈ పరిణామం అసలు మంచిది కాదు. 

అనివార్యత ఏమీ లేదు 
మేం తెలంగాణ ఇస్తామని చెప్పినప్పుడు అనివార్య పరిస్థితులేమీ లేవు. శ్రీకృష్ణ కమిషన్‌ తెలంగాణ ఇవ్వొద్దని చెప్పింది. ఇవ్వాలని, ఇవ్వొద్దని రెండు బలమైన డిమాండ్లు ఉండేవి. కానీ మేం రాజకీయ నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ ఇవ్వాలనే అభిప్రాయానికి వచ్చాం. తెలంగాణ ఏర్పాటు చరిత్రలో చాలా కీలకమైన రోజు 2013, జూలై31. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఆ రోజున రాష్ట్ర ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అప్పుడు  ఉద్యమం వేడి మీద లేదు. తెలంగాణ ఇవ్వాలన్నది చాలా సంక్లిష్ట నిర్ణయం. 
అందుకు రాజకీయంగా భారీ మూల్యం కూడా చెల్లించుకున్నాం. 

ఆ రహస్యం చాలా మందికి తెలియదు
‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై 2014, ఫిబ్రవరి 18న లోక్‌సభలో, 20న రాజ్యసభలో చర్చ జరిగింది. అంతకు రెండు రోజుల ముందు ఫిబ్రవరి 16న కాంగ్రెస్, బీజేపీ నేతల సమావేశం జరిగింది. వెంకయ్య, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌లు తెలంగాణ ఏర్పాటుకు ఒప్పుకున్న వారే. కానీ వీరిపై ఒక వ్యక్తి తీవ్ర ఒత్తిడి తెచ్చారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు అంగీకరించవద్దని వారికి ఫోన్లు చేశాడు. ఆయన ఎవరో కాదు...  మోదీ. ఆయన అధికారంలోకి వచ్చాక తానే చేయాలని అనుకున్నాడో, అసలు తెలంగాణే వద్దనుకున్నాడో తెలియదు కానీ, మీటింగ్‌కు వచ్చిన వారిని మాత్రం ఒత్తిడి చేశాడు.’ అని చెప్పిన జైరాం రమేశ్‌ ఈ విషయం చాలా మందికి తెలియదని, ఇప్పుడు ‘సాక్షి’ ద్వారానే చెబుతున్నానని వెల్లడించారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement