బంజారాహిల్స్: ఎన్నికల అధికారులు ఇచ్చే ఆదేశాలను పాటించే క్రమంలో పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహం ప్రజల పాలిట శాపంగా మారుతున్నది. గత రెండు వారాల నుంచి పోలీసులు తమ పరిధిలోని వైన్‌షాపులు, బ్యాంకులు, ఆభరణాల దుకాణాలు, దుస్తుల దుకాణాల వద్ద తిష్టవేస్తూ బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వచ్చిన డబ్బులను, వైన్ షాపుల నుంచి నాలుగు బాటిళ్లకు మించి తీసుకెళ్తున్న మద్యాన్ని సీజ్ చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
తాజాగా ఓ యువకుడు దసరా సందర్భంగా తన ఇంట్లో విందు కోసం సోమవారం సాయంత్రం 6 మద్యం సీసాలు, 20 బీర్లు తీసుకుని వెళ్తుండగా అప్పటికే అక్కడ తిష్టవేసిన పోలీసులు ఆయన వెళ్తున్న దారిలో కొద్ది దూరం అనుసరించి..కారును ఆపి మద్యం సీజ్ చేయడమే కాకుండా ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. ఇదేమిటని ఆ యువకుడు ప్రశ్నించగా నువ్వు ఓటర్లకు పంచడానికే మద్యం తీసుకెళ్ళుతున్నావంటూ పోలీసులు జవాబు ఇవ్వడంతో ఆ యువకుడు నోరెళ్లబెట్టాడు. ఇలా ప్రతి వైన్‌షాపు వద్ద పోలీసులు తిష్టవేస్తూ ఓవర్ యాక్షన్‌కు దిగుతున్నారు.
ఎవరు ఎంత మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారో నిఘా వేసి వారు కొద్ది దూరం వెళ్లాక ఆపి మద్యాన్ని సీజ్ చేసి దాన్ని ఎన్నికల లెక్కల్లో చూపిస్తున్నారు. అంతే కాదు..మద్యం దుకాణాలు, ఆభరణాల దుకాణాలు, దుస్తుల షాపుల యజమానులు రాత్రి షాపు బంద్ చేసి ఆ రోజు కలెక్షన్ తీసుకెళ్లాలనుకున్నా అక్కడ మఫ్టీలో నిఘా ఉంటున్న పోలీసులు వారిని వేటాడి వెంబడిస్తున్నారు. చాలా మంది షాపుల యజమానులు తమ రోజువారీ వసూలు చేసిన డబ్బులను బ్యాంకుల్లో జమ చేయలేని పరిస్థితులు తలెత్తున్నాయి.
ప్రతి రోజూ ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో ఒక లిక్కర్ కేసు నమోదు చేయాలని ఇటీవల ఉన్నతాధికారులు టార్గెట్ విధించారు. దీంతో పోలీసులు ఠాణాలను వదిలి వైన్‌షాపుల వద్ద తిష్టవేయాల్సిన పరిస్థితులు తలెత్తున్నాయి. ఇంకా ఎన్నికలకు ఆరువారాల సమయం ఉండగా ఇప్పటి నుంచి ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తారని అధికారులు ఎలా భావిస్తున్నారో ఆ దేవుడికే తెలియాలి.
మొత్తానికి అటు వ్యాపారులు, ఇటు ప్రజలు పోలీసుల తీరుతో విసిగిపోతున్నారు. చాలా చోట్ల తీవ్ర వాగ్వాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. పోలీసుల తీరును చాలా చోట్ల జనం ఎండగడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ అనాలోచిత, అసమర్థ నిర్ణయాలపై పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment