సాక్షి, హైదరాబాద్: ఓటరు నాడి పసిగట్టడం నాయకులకు పజిల్‌గానే ఉంది. గుమ్మం దాకా వెళ్లినా.. తాయిలాలు పంచినా.. ఆ ఓటు తమకే పడుతుందా? అనే అనుమానం అన్ని పార్టీల నాయకులనూ వేధిస్తోంది. గతంలో మాదిరి చాలామంది ఓటర్లు రాజకీయ అభిప్రాయం వెల్లడించడం లేదు. పనులన్నీ మానుకుని నేతల వెంటా అడుగులేయడం లేదు.
తప్పించుకు తిరగడంలో తమనే మించిపోయారని పలువురు నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓటరు మనోగతం తెలుసుకునేందుకు పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ప్రలోభాలు పెట్టే సమయంలో తమవైపే ఉంటామని అభ్యర్థుల అనుయాయులు ఓటర్లతో ప్రమాణాలు చేయిస్తున్నారు. అది కూడా నాయకులకు నమ్మకం కలిగించడం లేదు.
ఈ ప్రమాణాలు అందరికీ చేస్తున్నారని నేతల వాకబులో తెలుస్తోంది. ‘నాయకులు హామీలిచ్చి అమలు చేయనప్పుడు మేం ప్రమాణాలు చేస్తే తప్పేంటి’ అని కొందరు ఓటర్లు బాహాటంగానే అంటున్నారు.
డబ్బు గెలిపిస్తుందా?
ప్రతీ నియోజకవర్గంలో దాదాపు 2 లక్షలకు పైగా ఓటర్లుంటారు. కనీసం సగం మందికి డబ్బులు పంచాలని నేతలు టార్గెట్‌గా పెట్టుకుంటున్నారు. ఈ వ్యవహారంలో చాలాచోట్ల పోటాపోటీ నడుస్తోంది. ఖమ్మం జిల్లాలోని ఓ ముఖ్యమైన నియోజకవర్గంలో ఓ అభ్యర్థి ఓటుకు రూ.3 వేలు పంచినట్టు చెప్పుకుంటున్నారు. ఇది తెలిసిన మరో నేత మరో రూ. 500 ఎక్కువ ఇవ్వడానికి సిద్ధపడ్డారు.
దీంతో రెండో దఫా పంపకం ఉంటుందని డబ్బు పంపిణీ చేసిన అభ్యర్థి ఓటరుకు సంకేతాలు ఇవ్వాల్సి వచ్చింది. అంటే కనీసంగా నియోజకవర్గంలో రూ. 30 కోట్లు పంపకం చేయడం ప్రధాన పార్టీలకు అనివార్యమైంది. ఇంత చేసినా పడే ఓట్లు ఎన్ని? ఎంత మంది పోలింగ్ బూత్ దాకా వస్తారు? గతంలో మునుగోడు ఎన్నిక అత్యంత ఖరీదైందిగా చెప్పుకుంటారు. తమకు రూ. 10 వేలు ఇచ్చారని ఓటర్లే బాహాటంగా చెప్పిన పరిస్థితి.
ఇంత చేసినా డబ్బులు ఖర్చు పెట్టిన అభ్యర్థి అనుకున్న ఓట్లు పడలేదు. హుజూరాబాద్, హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లోనూ డబ్బు విపరీతంగా పంచినట్టు వార్తలొచ్చాయి. ఇంత చేస్తే చాలా మంది పోలింగ్ కేంద్రానికే రాలేదని నేతలు అంటున్నారు.
ఈ అనుభవం గుర్తు చేసుకుని నేతలు ఆందోళనలో ఉన్నారు. ఎవరి దగ్గర డబ్బు లు తీసుకోకున్నా, తమను ఓ పార్టీ ఖాతాలో చేర్చేస్తారని, ఆ తర్వాత స్థానికంగా రకరకాల వేధింపులుంటాయని, అందుకే అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నామని పలువురు ఓటర్లు అంటున్నారు. ‘అక్కడికెళ్లాక ఎవరికో ఒకరికి ఓటు వేస్తాం’ అని తెలివిగా తప్పించుకుంటున్నారు. నిజానికి ఓటరు ఏదో ఒక అభ్యర్థికి ఓటేయాలని ముందే ఫిక్స్ అవుతున్నాడు.
మీరు ఏ పార్టీ అంటే ఆ పార్టీనే
రోడ్‌షోలు, బహిరంగసభలకు వస్తున్న ప్రజల నుంచి అభిప్రాయం సేకరించేందుకు అన్ని పార్టీ నేతలూ ప్రయతి్నస్తున్నారు. ఇక్కడా ఓటర్ల నుంచి విచిత్రమైన అనుభవం ఎదురవుతోంది. ఇటీవల కరీంనగర్‌లో జరిగిన ఓ రోడ్డు షోలో ఓ నేత అనుయాయుడు ప్రజాభిప్రాయం సేకరించేందుకు ‘ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది?’ అని ప్రశ్నించాడు. ‘మీరు ఏ పార్టీ అనుకుంటున్నారు?’ అని తెలివిగా ఓటర్లు ఎదురు ప్రశ్న వేశారు.
అడిగే వ్యక్తి ఫలానా పార్టీ అని తెలిస్తే ఆ పార్టీనే గెలుస్తుందంటూ బదులిస్తున్నారు. గతంలో మాదిరి సభలు సమావేశాలకు పార్టీ పై అభిమానంతో రావడం లేదని నేతలకూ తెలుసు. వచ్చే వాళ్లకు ఒక్కొక్కరికీ రూ. 400 ఇవ్వడం రివాజుగా మారింది. దీంతో పాటు ఇతర ఖర్చులూ ఉంటాయి. వీళ్లంతా పెయిడ్ ఆరి్టస్టుల్లానే యాక్ట్ చేస్తున్నారు. అన్ని పార్టీల సభలకూ వెళ్తున్నారు.
సెంటిమెంటా?
రాష్ట్ర, జాతీయ స్థాయి నేతల సభలు పెడుతున్న అభ్యర్థుల కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. భారీ జనసమీకరణ చేస్తామని హామీ ఇచ్చిన నేతలకు ఇది సాధ్యం కావడం లేదు. పత్తి ఏరే సీజన్ కావడం, ఈ సమయంలోనే వరి కోతలు ఉండటంతో జనం ఆ పనులకు వెళుతున్నారు. ‘తాము వ్యవసాయ పనులకు వెళ్తే రోజుకు రూ. 800 వరకూ వస్తుంది... పార్టీలేమిస్తాయి? నాలుగొందలేగా?’ అంటున్నారు జనం.
పట్టణాల్లో అడ్డా కూలీలైతే అడ్డంగా మాట్లాడుతున్నారు. భవన నిర్మాణ పనులకు వెళ్తే రోజుకు రూ. వెయ్యి వస్తున్నాయని, అంతకన్నా ఎక్కువ ఇస్తేనే వస్తామంటున్నారు. ఎన్నికలొస్తే తమ పార్టీ అభ్యర్థి కోసం అన్ని పనులు మానేసి వచ్చే వాళ్లని, ఇప్పుడు ఏ సెంటిమెంట్ లేదంటూ చెప్పడం నేతలకు గుబులు పుట్టిస్తోంది.
ఇది చదవండి: TS Elections 2023: ఎన్నికల ప్రచారం దుమ్ము రేగింది..
Comments
Please login to add a commentAdd a comment